Dilip Kumar’s brother Aslam Khan dies: గతకొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్‌లు, ధియేటర్లు లేక అల్లాడుతున్న ఇండస్ట్రీని వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా చివరిచూపుకు కూడా నోచుకోలేని దుస్థితి నెలకొంది. తాజాగా ఇండస్ట్రీకి సంబంధించి మరో వ్యక్తి మరణించటంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ సోదరుడు, ఆయన సినిమాలకు తెర వెనుక కీలక పాత్ర పోషించిన అస్లాం ఖాన్ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు.. ఆయన వయసు 88 సంవత్సరాలు.
ఇటీవల దిలీప్ కుమార్ సోదరులు అస్లాం ఖాన్, ఇషాన్ ఖాన్‌లకు కరోనా సోకింది. దీంతో కొద్ది రోజులుగా వారు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారి వయసు ఎక్కువ కావడం పైగా బీపీ, షుగర్ లాంటి సమస్యలు కూడా ఉండడంతో అస్లాం ఖాన్ మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. పెద్ద వయసు కావడంతో ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని డాక్టర్స్ తెలిపారు.
ప్రస్తుతం ఆయన సోదరుడు ఇషాన్ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అస్లాం కన్నా ఇషాన్ వయసులో పెద్దవారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆక్సిజన్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయని వెల్లడించాయి ఆసుపత్రి వర్గాలు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు అస్లాం ఖాన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.