అలా రవితేజ ‘మాస్ మహారాజ్’ అయ్యారు.. ఆయన కొడుకు మహాధన్ ‘మాస్ యువరాజ్’..

  • Publish Date - August 15, 2020 / 07:11 PM IST

టాలీవుడ్ హీరోల్లో ‘మాస్ మహారాజ్’ అంటే రవితేజ అని, ఎనర్జిటిక్ హీరో అంటే కూడా రవితేజనే అని అందరూ చెప్తుంటారు. పేరుకి తగ్గట్టే ఆన్‌స్క్రీన్ ఆయన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ఎనర్జిటిక్‌గా ఊరమాస్ లెవల్లో ఉంటాయి. అసలు రవితేజకు ఈ ‘మాస్ మహారాజ్’ అనే పేరు ఎలా వచ్చింది.. ఆయన పేరుకి ముందు ఈ ట్యాగ్ ఎవరు పెట్టారు.. ఏంటా సంగతి?.. అనే విషయాలు తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.

గతకొద్ది రోజులుగా హరీష్ తన సొంత పాడ్‌కాస్ట్ ‘సౌండ్స్ గుడ్’ ద్వారా పలు విషయాల గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా
రవితేజ ‘మాస్ మహారాజ్’ పేరు వెనుకగల ఆసక్తికరమైన విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు.

‘‘రవితేజ హీరోగా నటించిన ‘వీడే’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఇద్దరికీ హిందీ సినిమాలంటే, అందులోనూ అమితాబ్ బచ్చన్ అంటే మరీ ఇష్టం.. ఈ కామన్ క్వాలిటీస్‌తో ఇద్దరం క్లోజ్ అయ్యాం. షూటింగ్ అప్పుడు షాట్ గ్యాప్‌లోనూ, ఆఫీసులోనూ సినిమాల గురించి ఎక్కవగా మాట్లాడుకునే వాళ్లం. కలసినప్పుడల్లా ‘మాస్ మహారాజ్’ అని పిలిచేవాణ్ణి. ఓసారి ‘లక్ష్యం’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయనను స్టేజ్ మీదకు పిలిచేటప్పుడు ‘మాస్ మహారాజ్’ అని పిలమని యాంకర్ సుమ గారికి చెప్పాను. ఆమె అలానే పిలవడంతో.. ఆయన ‘ఇది వీడి పనే అయింటుంది’.. అనుకున్ని నవ్వుకున్నారు. ఇక అప్పటినుంచి రవితేజని అందరూ ‘మాస్ మహారాజ్’ అని పిలవడం మొదలుపెట్టారు. ‘మిరపకాయ్’ అయిపోయిన తర్వాత ఓసారి రవితేజ ఆఫీసుకి వెళ్తే అక్కడ ఓ బాబు కూర్చుని ఉన్నాడు. నేను గుర్తు పట్టేసి వెంటనే ‘మాస్ యువరాజ్’ మహాధన్ అని పిలిచాను. అది విని రవితేజ ‘అప్పుడే మొదలుపెట్టేశావా’ అన్నారు. నేను.. అంతే కదన్నయ్యా మాస్ మహారాజ్‌కి పుట్టినవాడు ‘మాస్ యువరాజ్’ అవుతాడు కదా అన్నాను. ఒకవేళ మహాధన్ హీరో అయితే అతని పేరుకి ముందు ‘మాస్ యువరాజ్’ అని పడుతుందో లేదో తెలియదు కానీ మొత్తానికి ‘మాస్ మహారాజ్’ అనే పేరు వెనుక ఉన్న స్టోరీ అయితే ఇది’’.. అని చెప్పుకొచ్చరు హరీష్ శంకర్.. రవితేజ, హరీష్ శంకర్ కలయికలో ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాలు వచ్చాయి.