Jani Master : జానీ మాస్టర్ కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్.. క్షమాపణలు చెప్పాల్సిందే..
దీంతో ఈ వ్యాఖ్యలను ఫిలిం ఫెడరేషన్ సీరియస్ గా తీసుకొని విచారణకు పిలిచారు. (Jani Master)
- Saketh U
- Published on- July 17, 2026 / 07:58 PM IST
Jani Master
Jani Master : ఇటీవల జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే డ్యాన్సర్లు అసోసియేషన్ లో ఉన్న లోపాలు బయటపడ్డాయి. ముంబై డ్యాన్సర్లు ని తీసుకొస్తున్నారని జానీ మాస్టర్ పై ఆరోపణలు చేయడంతో జానీ మాస్టర్ భార్య, డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ సుమలత.. కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్సర్లు కి డబ్బులు ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతున్నారని, వాళ్ళు వెళ్ళిపోతే కార్యవర్గం మొత్తం ఎందుకు ఎన్నికలు పెట్టాలి, మేము మంచి చేసినా తప్పు పడుతున్నారు, వాళ్ళ తప్పులు ప్రశ్నించినందుకు మమ్మల్ని అంటున్నారు అంటూ మీడియా ముందు ఫైర్ అయింది.
ఈ వివాదం పెద్దది అవడంతో ఫిలిం ఫెడరేషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. దీంతో సుమలత, జానీ మాస్టర్.. మా అసోసియేషన్స్ అన్ని కలిస్తేనే ఫెడరేషన్ అవుతుంది. ఫెడరేషన్ ఇష్టానుసారంగా రూల్స్ పెడితే కుదరదు. ఫెడరేషన్ చెప్పినట్టు మేము నడుచుకోము. డాన్సర్స్ అసోసియేషన్ లో ఇంటి దొంగలను ఫెడరేషన్ వాళ్ళు సమర్థిస్తున్నారు. మాపై రూల్స్ రుద్దాలని చూస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసారు.
Also Read : Tollywood Actor : స్టార్ డైరెక్టర్ ని తిట్టిన నటుడు.. మీడియాపై అరిచి.. కెమెరా చిప్‌లు విరగ్గొట్టి..
దీంతో ఈ వ్యాఖ్యలను ఫిలిం ఫెడరేషన్ సీరియస్ గా తీసుకొని విచారణకు పిలిచారు. కానీ జానీ మాస్టర్ హాజరవలేదు. దీంతో నేడు జానీ మాస్టర్ కు షోకాజ్ నోటీస్ లు జారీ చేసింది ఫిల్మ్ ఫెడరేషన్. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ నెల 14న విచారణకు పిలిచినా హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 7 రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు. అంతే కాకుండా జానీ మాస్టర్ కు ఫెడరేషన్ తరపున సహాయ నిరాకరణ చేస్తామని, బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు అని అన్నారు.
అలాగే.. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందే అని, డాన్సర్స్ ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, ఫెడరేషన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయం వరకు సహాయ నిరాకరణ ఉంటుందని తెలిపారు. మరి దీనిపై సుమలత, జానీ మాస్టర్ స్పందిస్తారేమో చూడాలి.
