బహుముఖ ప్రజ్ఞాశాలి:వింజమూరి అనుసూయదేవి కన్నుమూత 

  • Publish Date - March 24, 2019 / 05:25 AM IST

అమెరికా : ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయదేవి కన్నుమూశారు. అనసూయదేవి గత కొంతకాలంగా వయసుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతు తన 99వ ఏట  అమెరికాలోని హ్యుస్టన్‌లో మృతి చెందారు. 1920 మే 12న కాకినాడలో జన్మించిన అనసూయదేవి.. ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు. ప్రముఖ గాయని వింజమూరి సీతాదేవి స్వంత సోదరి అయిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా తెలుగు జానపద గీతాలకు ఆమె విశేష ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టారు. 

ఆంధ్రా వర్సిటీ నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్‌ను వింజమూరి అందుకున్నారు. జానపద గేయాలు రాయడంలో, బాణీలు కట్టడంలో, పాడటంలో అనసూయదేవికి మంచి పట్టుంది. అలాగే హర్మోనియం వాయించడంలో సిద్ధహస్తురాలు. జానపద, శాస్త్రీయ సంగీతానికి ఆమె చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయంల నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్ అందుకున్నారు. అనసూయదేవికి ఐదుగురు సంతానం. 

భారతీయ రంగస్థల  నటుడు, తెలుగు-సంస్కృత పండిట్,  రచయిత అయిన వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహ రావు కుమార్తె. సంగీతదర్శకురాలిగా మహిళలు పెద్దగా లేని కాలం..మహిళలు సంగీత దర్శకత్వం చేయటాన్ని హర్షించని కాలంలో పలు తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు అనసూయాదేవి.తన ఏడేళ్ల వయస్సులోనే ఓ గ్రామ్ ఫోన్ రికార్డ్ కోసం తన గళం విప్పిన అనసూయాదేవి తెలుగులో  ‘బంగారు పాప’, ‘అగ్గిరాముడు’, ‘కనకదుర్గ మహత్యం’, ‘పెంకి పెళ్లాం’, ‘ఒక ఊరికథ’, తమిళంలో ‘వంజికోట వాలిబన్‌’ మొదలైన సినిమాలకు సంగీతం అందించారు. 

శ్రీశ్రీ, రాయప్రోలు గేయాలకు ట్యూన్‌
మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రోత్సాహంతో ఆయన కవితలకు, పాటలకు బాణీ కట్టేవారు అనుసూయాదేవి. అంతేకాదు ఆయన రాసిన జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి.., శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గేయం, రాయప్రోలు సుబ్బారావుగారు రాసిన శ్రీలు పొంగిన జీవగడ్డయు.. పాలుకారిన భాగ్యసీమయు.., గురజాడ రాసిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ వంటి వాటికి బాణీలు కట్టిన ప్రతిభ అనుసూయాదేవి సొంతం.