Euphoria Review
Euphoria Review : భూమిక, సారా అర్జున్, రోహిత్, విగ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్విరాజ్, గౌతమ్ మీనన్.. పలువురు ముఖ్య పాత్రల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యుఫోరియా. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ, యుక్త గుణ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. యుఫోరియా సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Euphoria Review)
చైత్ర(సారా అర్జున్) 17 ఏళ్ళ అమ్మాయి. సివిల్స్ చేయాలనేది తన కల. ఓ రోజు ఫ్రెండ్ తో కలిసి పబ్ లో పార్టీకి వెళ్తుంది. అక్కడ వికాస్(విగ్నేష్ రెడ్డి), అతని ఫ్రెండ్స్ చైత్రని పరిచయం చేసుకొని తనని బర్త్ డే పార్టీ అని కార్ లో తీసుకెళ్లి రేప్ చేస్తారు. చైత్ర ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. చైత్ర చెప్పిన ఆధారాలతో కమిషనర్ జయదేవ్(గౌతమ్ మీనన్) అతని టీమ్ పారిపోయిన వికాస్, అతని ఫ్రెండ్స్ ని పట్టుకుంటారు. వాళ్ళు కూడా మైనర్స్ అవడంతో వాళ్ళ పేర్లు చెప్పకుండా వాళ్ళందరి పేరెంట్స్ పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో వాళ్ళ పేర్లు మీడియా ముందు బయటపెట్టి సంచలనం సృష్టిస్తాడు జయదేవ్.
అందులో వికాస్ తల్లి వింధ్య(భూమిక), తండ్రి(రోహిత్) పేర్లు కూడా చెప్పడంతో, వింధ్య ఒక మంచి ప్రిన్సిపాల్ కావడంతో కొడుకు రేపిస్ట్ అని విమర్శలు వస్తాయి. వికాస్ అతని ఫ్రెండ్స్ మీద పోక్సో కేసు పెట్టగా అందరూ తమ కొడుకులను ఎలా బయటకు తీసుకు రావాలని చూస్తే వింధ్య మాత్రం తన కొడుక్కి శిక్ష పడాలనుకుంటుంది. మరి వికాస్, అతని ఫ్రెండ్స్ కి శిక్ష పడుతుందా? చైత్ర ఏమైంది? వింధ్య తన కొడుకుని ఏం చేసింది? జయదేవ్ ఈ కేసుని ఎలా డీల్ చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Varanasi : అక్కడ షూటింగ్ చేయబోయే మొదటి ఇండియన్ సినిమా.. ‘వారణాసి’తో సరికొత్త రికార్డ్..
ఒక్కడు సినిమా తర్వాత గుణశేఖర్ – భూమిక మరోసారి కలిసి పనిచేస్తుండటంతో మొదట ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా సాగుతుంది. చైత్ర, వికాస్ అందరి పరిచయం, చైత్రని రేప్ చేయడం, పోలీస్ కేస్ పెట్టడం, జయదేవ్ కేస్ డీల్ చేయడం, వాళ్లకు శిక్ష పడటంతో కథ ఇంట్రెస్ట్ గానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో జైలు లో వాళ్ళేం చేసారు. వింధ్య కొడుకుని ఏం చేసింది, మళ్ళీ జయదేవ్ వచ్చి ఏం చేసాడు అనే కథాంశంతో నడుస్తుంది.
ఫస్ట్ హాఫ్ లో సీరియస్ గా కథ నడుస్తుంటే తల్లి కొడుకు ఎమోషన్ కోసం ఓ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ పెట్టారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇక సెకండ్ హాఫ్ కన్ఫ్యూజ్ గా సాగుతుంది. కాస్త సాగదీశారు కూడా. అసలు కథని డ్రగ్స్ కి లింక్ చేసి కథనం మార్చేయడంతో అసలు కథ గాడి తప్పినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా కాస్త కన్ఫ్యుజింగ్ గా సెకండ్ హాఫ్ ని చూపించారు. కోర్ట్ కి వింధ్య వెళ్లే సీన్స్ కి సరైన ముగింపు ఇవ్వలేదు.
చాలా సినిమాల్లో నిందితులకు శిక్ష పడటంతో కథ అయిపోతుంది కానీ ఇందులో శిక్ష పడిన కొడుకుని తల్లి మార్చాలనుకోవడం, ఎలా మారుస్తుంది అనే కథాంశాన్ని చూపించారు. సెకండ్ హాఫ్ కాస్త గాడి తప్పినా మళ్ళీ ఆసక్తికర క్లైమాక్స్ తో ముగించారు. ఇప్పటి జనరేషన్ పిల్లలు తప్పుడు పనులు చేస్తున్నారని, చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారని, పేరెంట్స్ కూడా వాళ్ళను సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే అంశాన్ని గుణశేఖర్ ఈ సినిమాతో బాగానే చెప్పారు.
అలాగే పోక్సో కేసు డీలింగ్ ఎలా ఉంటుందో కూడా క్లారిటీగా చూపించారు. టీజర్, ట్రైలర్స్ వచ్చాక ఇదేదో రేప్ కేసు, వాళ్లకు శిక్షపడటం లాంటి రొటీన్ కథ అనుకున్నారు కానీ సినిమా చూసాక ఓ మంచి మెసేజ్, ఎమోషన్ చూపించారని అభిప్రాయపడటం ఖాయం. సినిమా చూసి ఓ రెండు మూడు చోట్ల కన్నీళ్లు పెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. చాన్నాళ్ల తర్వాత గుణశేఖర్ నుంచి ఒక మంచి సినిమా వచ్చిందని చెప్పొచ్చు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలే చేస్తుంది. యుఫొరియాలో తల్లి పాత్రలో భూమిక ఒదిగిపోయింది. సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్ లో భూమిక తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. కథ అంతా సారా అర్జున్ వల్లే జరిగినా సినిమాలో తను కాసేపే కనిపించినా తన పాత్రతో ఎమోషనల్ గా మెప్పించింది.
విగ్నేష్ రెడ్డి మెయిన్ లీడ్ లో నెగిటివ్ షేడ్స్ చూపిస్తూ రెండు వేరియేషన్స్ లో అదరగొట్టాడు. భవిష్యత్తులో విగ్నేష్ కి మరిన్ని మంచి పాత్రలు పడే అవకాశం ఉంది. గౌతమ్ మీనన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలరించారు. ఒకప్పటి హీరో రోహిత్ విగ్నేష్ కి తండ్రి పాత్రలో కనిపించి షాక్ ఇచ్చారు. పృథ్వీరాజ్ అడ్డాల నెగిటివ్ షేడ్స్ లో బాగానే నటించాడు. ఆశ్రిత వేముగంటి, రవి ప్రకాష్, లిఖిత యలమంచలి, కల్పలత.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు కొన్ని ఎడిటింగ్స్ సీక్వెన్స్ లు బాగున్నా సెకండ్ హాఫ్ లో కాస్త కట్ చేయాల్సింది. సాంగ్స్ యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. గుణశేఖర్ రెగ్యులర్ కథనే కొత్తగా ఆసక్తికర కథనంతో రాసుకొని యుఫొరియా అని ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఎమోషనల్ చిత్రంగా తెరకెక్కించారు. నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘యుఫోరియా’ ఈ జనరేషన్ పిల్లలు, పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.