అక్కినేని జయంతి : ANR LIVES ON

సెప్టెంబర్ 20 : నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు 96వ జయంతి.. 'ఏఎన్నార్ లివ్స్ ఆన్'.. 

  • Publish Date - September 19, 2019 / 01:01 PM IST

సెప్టెంబర్ 20 : నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు 96వ జయంతి.. ‘ఏఎన్నార్ లివ్స్ ఆన్’.. 

అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించి, తెలుగు ప్రేక్షకాభిమానుల ఆదరణ చూరగొన్న మహోన్నత వ్యక్తి. సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి. నాటక రంగం నుండి సినిమాల వైపు వచ్చిన ఏఎన్నార్ తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఆయన సినిమాలు, వాటి రికార్డులు, ఆయన పోషించిన పాత్రలు వంటి వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటసామ్రాట్.

అక్కినేని తొలి స్వర్ణోత్సవ చిత్రం ‘దసరాబుల్లోడు’, తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేనే. ‘సీతారామ జననం’ చిత్రంతో మొదలు పెడితే.. ‘మాయాబజార్’, ‘చెంచులక్ష్మీ’, ‘భూకైలాస్’, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’, ‘బాలరాజు’, ‘రోజులు మారాయి’, ‘నమ్మినబంటు’, ‘మిసమ్మ’, ‘గుండమ్మకథ’, ‘సంసారం’, ‘బ్రతుకు తెరువు’, ‘ఆరాధన’, ‘దొంగ రాముడు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘అర్థాంగి’, ‘మాంగల్యబలం’, ‘ఇల్లరికం’, ‘శాంతి నివాసం’, ‘వెలుగు నీడలు’, ‘దసరా బుల్లోడు’, ‘భార్యాభర్తలు’, ‘ధర్మదాత’, ‘బాటసారి’, ‘దేవదాసు’, ‘ప్రేమనగర్’, ‘ప్రేమాభిషేకం’, ‘మేఘసందేశం’, ‘సీతారామయ్య గారి మనమరాలు’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరపురాని చిత్రాలు.. మరెన్నో అద్భుతమైన పాత్రలు..

భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పి, తనకెంతో ఇచ్చిన సినీ కళామతల్లి రుణం తీర్చుకున్నారాయన. తుదిశ్వాస వరకూ నటిస్తూనే ఉండాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు అక్కినేని. తనయుడు నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్‌తో కలిసి తెరపంచుకుని, తను నచించిన చివరి చిత్రంగా.. ‘మనం’ రూపంలో అక్కినేని కుటుంబానికి, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్లారు.

భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన పోషించిన వివిధ పాత్రల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారు. తెలుగు వెలుగు ఉన్నంతకాలం, తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం ‘అక్కినేని’ ఉంటారు. ‘ఏఎన్నార్ లివ్స్ ఆన్’.. 

 

ట్రెండింగ్ వార్తలు