తన హాస్యంతో గత మూడు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారి పుట్టినరోజు నేడు..
ఖాన్‌తో గేమ్స్ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయ్..
నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి రావుగారు..
నెల్లూరు పెద్దా రెడ్డి ఎవరో తెలీదా..
ఎంటి.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా..
రకరకాలుగా ఉంది మాష్టారు..
అబ్బా మీరు సిగ్గుపడకండి.. చచ్చిపోవాలనిపిస్తుంది..
నా పర్ఫార్మెన్స్ నచ్చితే ఎస్ఎమ్ఎస్ చేయండి..
బ్రహ్మీ లేని సినిమా.. మసాలా లేని బిర్యాని లాంటిది బాసూ..
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. ఈ పేరు చెబితే చాలు.. ముఖాల్లో చిరునవ్వు వెల్లి విరుస్తుంది. నేడు (ఫిబ్రవరి 1) గత మూడు దశాబ్దాలుగా తన మార్క్ కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న బ్రహ్మానందం పుట్టినరోజు.. ఆయన గురించి ఆయన నటించిన సినిమాల గురించి పోషించిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా కామెడీలో బ్రహ్మానందానిది ఓ డిఫరెంట్ స్టైల్, ఆయన మార్క్ హాస్యం, హావభావాలు, డ్యాన్స్ మరెవరికీ సాధ్యం కావు అన్నంతగా తెలుగు సినిమా హాస్యంపై చెరగని ముద్ర వేశారాయన. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అనే తన గురువు జంధ్యాల మాటలను పాటించే బ్రహ్మానందం.. సినిమా సినిమాకీ వైవిధ్యం చూపించేవారు. తెలుగు సాహిత్యంలో ఎమ్మే చేసిన తర్వాత అత్తిలిలో తొమ్మిదేళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
పుట్టినరోజు నాడే తొలివేషం..
బ్రహ్మానందాన్ని మొట్టమొదటి సారిగా కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ.. నరేశ్ కథానాయకుడిగా నటించిన ‘శ్రీ తాతావతారం’ అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా ఆయన నటించారు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశారు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నట జీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా, తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహ! నా పెళ్ళంట!’..
హాస్యానికి వరం – తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ
ఆ సినిమాలో అరగుండుతో ఆయన పలికించిన హావభావాలు, సంభాషణలు ఇప్పటికీ గుర్తే. ఇక అక్కడినుండి వెనుదిరిగి చూసుకోలేదాయన.. అప్పటి అగ్ర దర్శకుల దగ్గరినుండి శ్రీను వైట్ల, త్రివిక్రమ్, వినాయక్ వంటి దర్శకులందరూ బ్రహ్మానందానికి తమ సినిమాల్లో పెద్ద పీట వేస్తూ వచ్చారు. ఈ మధ్య ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘రాములో రాములా’ పాటలో తళుక్కున మెరిసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
వెయ్యికి పైగా సినిమాలు – లెక్కలేని అవార్డులు, రివార్డులు..
వివిధ భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్వారాన్నిచ్చింది. ఉత్తమ హాస్యనటుడిగా అయిదు నంది అవార్డులు, ఓ ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
గ్యాప్ ఇవ్వలా.. వచ్చిందంతే – రాననుకున్నారా రాలేననుకున్నారా..
మనం బాధలో ఉంటే ఆయన ఫోటో చూసినా, ఆయన నటించిన ఏదో ఒక సన్నివేశం చూసినా వెంటనే ఉపశమనం పొందుతాం. గత మూడు దశాబ్దాలకు పైగా తన నటనతో ఎందరో ముఖాల్లో చిరునవ్వుల దివిటీలు వెలిగిస్తున్న హాస్యబ్రహ్మ తెలుగు ప్రేక్షకులకు మరిన్ని నవ్వులు పంచాలని, పది కాలాలపాటు పచ్చగా ఉండాలని కోరుకుంటూ.. బ్రహ్మ ఆనందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..