బన్నీ విలన్ బర్త్‌డే!

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి.. జనవరి 16న తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు..

  • Publish Date - January 16, 2020 / 07:42 AM IST

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి.. జనవరి 16న తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు..

అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు, మంచి మనసున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి.. జనవరి 16న తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తమిళనాట 1998లో ‘గోకులైతిల్ సీతై’ అనే సినిమాలో ఆడియన్స్‌లో ఒకడిగా కనిపించిన విజయ్.. 2004లో ‘ఎమ్ కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మీ’ (అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి రీమేక్) బాక్సింగ్ ఆడియన్స్‌లో కూర్చనే వ్యక్తిగా కనిపిస్తాడు.

ధనుష్ ‘పుదుపెట్టై’, విష్ణు విశాల్ హీరోగా పరిచయమైన ‘వెన్నిల కబడి కుజు’ (తెలుగులో భీమిలి కబడ్డీ జట్టు), కార్తీ ‘నాన్ మహాన్ అల్లా’ (నా పేరు శివ), విష్ణు విశాల్ ‘భలే పాండియా’ సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించాడు.

2010లో ‘తెన్మెర్కు పరువకాట్రు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ‘పిజ్జా’ తో బ్రేక్ వచ్చింది. తర్వాత ‘నడువుల కొంజం పక్కత కానొమ్’ (పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్) సినిమాలో గతం మర్చిపోయిన కుర్రాడిగా తన బ్రహ్మాండమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘సూదు కవ్వం’ (గడ్డం గ్యాంగ్) తో వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన నటనతో తమిళనాట తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవడంతో పాటు తమిళ ఫ్యాన్స్, ప్రేక్షకుల చేత ‘మక్కల్ సెల్వన్’ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు.

‘సేతుపతి’, ‘ఇరైవి’, ‘ధర్మదురై’, ‘విక్రమ్ వేధ’ ‘96’, ‘సీతకాథి’, ‘సూపర్ డీలక్స్’, ‘సంగ తమిళన్’ వంటి సినిమాలతో తమిళ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా నటిస్తూనే.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ సినిమాలో విలన్‌గానూ అలరించిన విజయ్, మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రంలో రాజాపాండిగా నటించాడు.

ప్రస్తుతం మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలోనూ విలన్‌గా నటించనున్నాడు.

దళపతి విజయ్ 64వ సినిమాలోనూ విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీతో హిందీ పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. తమిళనాట హీరోగా నటించిన కొన్ని సినిమాలు షూటింగ్ దశలోనూ, మరికొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలోనూ ఉన్నాయి.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, క్రమశిక్షణ కలిగి ఉండడం విజయ్ సేతుపతి ప్లస్ పాయింట్స్.. మరిన్ని మంచి సినిమాలలో తన అసాధారణ నటనతో ప్రేక్షకాభిమానులను అలరించాలని కోరుకుంటూ విజయ్ సేతుపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు.