హ్యాపీ బర్త్‌డే దగ్గుబాటి : విక్టరీ వెంకటేష్ డిసెంబర్ 13న తన 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు..
విక్టరీ వెంకటేష్.. విజయాలనే ఇంటి పేరుగా మార్చుకున్న మనసున్న మంచి నటుడు.. తెలుగు సినీ పరిశ్రమలో అందరి హీరోల అభిమానులూ అభిమానించే అజాత శత్రువు దగ్గుబాటి వెంకటేష్ డిసెంబర్ 13న తన 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వెంకీ కెరీర్‌లో తొలిసారిగా తన జన్మదినం నాడు రిలీజ్ అయిన ఏకైక చిత్రం ‘వెంకీ మామ’ కావడం విశేషం.
రియల్ లైఫ్ మామా అల్లుళ్లు అయిన విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించారు. ఈ సినిమా హిట్ టాక్ దక్కించుకుంది. 1986 లో ‘కలియుగ పాండవులు’ చిత్రంతో ప్రారంభమైన వెంకటేష్ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్, మెమరబుల్ మూవీస్ ఉన్నాయి.
‘శ్రీనివాస కళ్యాణం’, ‘స్వర్ణకమలం’, ‘వారసుడొచ్చాడు’ ‘ప్రేమ’, ‘బొబ్బిలిరాజా’, ‘కూలీ నెం.1’, ‘క్షణ క్షణం’, ‘చంటి’, ‘సుందరకాండ’, ‘అబ్బాయిగారు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ‘పవిత్రబంధం’ వంటి సినిమాలతో తనకంటే సెపరేట్ రూట్ వేసుకోవడమే కాక మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.
Read Also : కమర్షియల్ హంగులతో వెంకీమామ – రివ్యూ
‘సూర్యవంశం’, ‘గణేష్’, ‘ప్రేమించుకుందాం రా’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజా’, ‘కలిసుందాం రా’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఘర్షణ’, ‘మల్లీశ్వరి’, ‘సంక్రాంతి’, ‘లక్ష్మీ’, ‘తులసి’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ ‘గురు’, ‘ఎఫ్ 2’, ‘వెంకీ మామ’.. ఇలా లవ్, కామెడీ, సెంటిమెంట్ అండ్ యాక్షన్ వంటి డిఫరెంట్ పాత్రలతో వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్న విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళనాట ఘన విజయం సాధించిన ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు.