‘‘భారతీయుడు 2’’ – ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందచేయనున్నట్టు ప్రకటించిన కమల్ హాసన్..
విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) మరోసారి రియల్ లైఫ్ హీరో అని నిరూపించుకున్నారు. కోట్ల రూపాయలు డొనేట్ చేసి అందరి మనసులూ దోచుకున్నారు. #Indian2 (భారతీయుడు 2) సినిమా షూటింగ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న భారీ ప్రమాదంలో ముగ్గురు మరణించగా 10 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కమల్‌హాసన్, కాజల్‌అగర్వాల్ తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరగడానికి 10 సెకన్ల ముందు వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
మృతుల్లో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు(28), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్(60) ఉన్నారు. తాజాగా కమల్ హాసన్ మృతుల కుటుంబాలకు (ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున) రూ.3 కోట్లు ఆర్థికసాయం అందచేస్తున్నట్టు ప్రకటించారు. తన బాధ కన్నా.. వారిని కోల్పోయిన కుటుంబాల వారు పడుతున్న బాధ ఎన్నో రెట్లు ఎక్కువ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కమల్.. ‘‘సినిమా పరిశ్రమలో పనిచేసే వాళ్లకి రక్షణ ఎంతటి ప్రశ్నార్థకంగా ఉంటుందో ఈ ప్రమాదం తెలియచేస్తుంది.
ఇకముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా ఈరోజు ఉదయం ఇండస్ట్రీలోని నా సన్నిహితులతో మాట్లాడాను. ఎన్నో కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమా రూపొందుతుదని గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ సినిమా కోసం పనిచేసే వాళ్లకి సరైన రక్షణ కల్పించలేకపోయినందుకు వ్యక్తిగతంగా సిగ్గుపడుతున్నాను..
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా తరఫు నుంచి రూ.కోటిని ఆర్థికసాయంగా అందిస్తాను. ఇది నష్టపరిహారం కాదు. మృతి చెందిన వారు నిరుపేద కుటుంబాలకు చెందినవారు. మూడేళ్ల క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది. కుటుంబంలోని కీలకమైన వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం జీవనం సాగించడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు బాగా తెలుసు’’ అంటూ భావేద్వేగానికి లోనయ్యారు కమల్.