Jackie Chan హాంకాంగ్‌కు చెందిన హాలీవుడ్ యాక్షన్ మూవీ స్టార్ మరియు మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ “జాకీ చాన్”..తాను చైనా అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(CPC)లో చేరాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట బయటపెట్టారు. ఓ చర్చా కార్యాక్రమంలో జాకీ చాన్ ఈ మేరకు వెల్లడించారు.
జులై-1,2021న సీపీసీ వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ రాజధాని బీజింగ్ లో చేసిన కీలక ప్రసంగంపై గురువారం(జులై-8,2021)బీజింగ్ లో నిర్వహించిన ఓ చర్చా కార్యాక్రమంలో చైనా సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చైనా ఫిల్మ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీ చాన్ ఈ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. పార్టీలో చేరికపై తన ఆసక్తిని బయటపెట్టారు. సీపీసీ వందేళ్లలోపు చేస్తానని చెప్పిన హామీలను కొన్ని దశాబ్దాల్లోనే నెరవేర్చగలదని జాకీ చాన్ అన్నారు. సీపీసీలో తాను సభ్యుడిని అవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.
కొన్నేళ్లుగా సీపీసీకి జాకీ చాన్ మద్దతిస్తున్నారు. సీపీసీకి చెందిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (పార్టీ నామినేట్ చేసిన నిపుణుల సలహా సంఘం)లో కూడా ఆయన కొంతకాలం సభ్యుడిగా పనిచేశారు. మరోవైపు, 2019లో హాంకాంగ్ లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనను వ్యతిరేకించి జాకీ చాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. హాంకాంగ్, చైనా నా జన్మస్థలాలు, నా ఇళ్లు. చైనా నా దేశం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అలాగే నా ఇంటిని కూడా. హాంకాంగ్ లో త్వరలోనే శాంతి తిరిగి నెలకొంటుందని ఆశిస్తున్నాను అని హాంకాంగ్ లో నిరసనల సమయంలో వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు జాకీ చాన్.