సింగర్ సూసైడ్ – ఎవ్వరినీ వదలొద్దంటూ విన్నపం

అత్తింటి వేధింపులు తాళలేక వర్ధమాన గాయని సుష్మిత ఆత్మహత్య..

  • Publish Date - February 18, 2020 / 04:48 AM IST

అత్తింటి వేధింపులు తాళలేక వర్ధమాన గాయని సుష్మిత ఆత్మహత్య..

వర్ధమాన గాయకురాలు సుష్మిత సోమవారం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అదనపు  కట్నం కోసం భర్త అత్త మామల వేధింపులే కారణమని ఆమె ఆత్మహత్యకు ముందు తన తమ్ముడికి వాట్సాప్‌ మెసేజ్‌ పంపారు. బెంగళూరు నాగరబావి ప్రాంతంలోని ఇంటిలో ఆమె ఉరి వేసుకుని చనిపోయారు.

పలు కన్నడ చిత్రాలు, సీరియల్స్‌ ద్వారా శాండిల్‌వుడ్‌లో గుర్తింపు పొందిన గాయని సుష్మిత (26) ఆత్మహత్య నగరంలో, కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది.సుష్మిత ఆత్మహత్యకు ముందు తన తమ్ముడు సచిన్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ పంపారు. ‘అమ్మా నన్ను క్షమించు, నా భర్త, వాళ్ల బంధువులు నన్ను మానసికంగా చిత్ర హింసలు పెడుతున్నారు, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. నా తప్పునకు నేనే శిక్ష అనుభవిస్తున్నా’.. అని వాట్సాప్‌ మెసేజ్‌‌లో పేర్కొన్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

‘నా మరణానికి భర్త శరత్‌తో పాటు ఇతర బంధువులు వైదేహి, గీతలే ప్రధాన కారణం. పెళ్లయిన ఏడాదిన్నర నుంచి కష్టాలు అనుభవిస్తున్నా, నన్ను వేధించిన ఎవ్వరినీ వదలొద్దు’ అంటూ మెసేజ్‌ పెట్టారు. ‘అమ్మా మిస్‌ యూ.. నీ కోసం తమ్ముడు సచిన్‌ ఉన్నాడు. వాడిని బాగా చూసుకో, నా డెత్‌నోట్‌ను అమ్మకు చూపించు తమ్ముడు’ అంటూ మెసేజ్ చేశారు.

ఇదిలా ఉంటే తమ కుమార్తె ఆత్మహత్యకు భర్త, అత్తమామలే కారణమని సుష్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుస్మిత సున్నిత మనస్కురాలని, ఆమె ఆత్మహత్య కలచివేసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సన్నిహితులు సంతాపం తెలుపుతున్నారు.