103 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచిన హాలీవుడ్‌ లెజెండ్‌ కిర్క్‌ డగ్లస్‌

ప్రముఖ హాలీవుడ్ లెజెండ్. కిర్క్ డగ్లస్ 2020 ఫిబ్రవరి 5న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియచేశారు..

  • Publish Date - February 6, 2020 / 05:54 AM IST

ప్రముఖ హాలీవుడ్ లెజెండ్. కిర్క్ డగ్లస్ 2020 ఫిబ్రవరి 5న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియచేశారు..

కిర్క్ డగ్లస్.. ఈ పేరు తెలియని ప్రపంచ సినీ ప్రేమికులుండరు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు హాలీవుడ్ చిత్రపరిశ్రమలో నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన ప్రతిభను చాటుకున్నారు డగ్లస్. 103 సంవత్సరాల వయసులో 2020 ఫిబ్రవరి 5న కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. 1916లో అమ్‌స్టర్‌డామ్‌లోని డానిలోవిచ్‌లో నిరుపేద కుటుంబంలో కిర్క్‌ డగ్లస్‌ జన్మించారు.

అనేక ఒడిదుడకులను ఎదుర్కొన్న ఆయన జీవితం డైనా డిల్‌తో పెళ్లితో  కీలక మలుపు తిరిగింది. పెళ్ళి తర్వాత థియేటర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగారు. ఏడు దశాబ్దాలుగా సాగిన కెరీర్‌లో డగ్లస్ 90 కి పైగా సినిమాల్లో నటించారు. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఒక దశాబ్దం (1950-60) పాటు హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన ఘనుడు డగ్లస్. ‘స్పార్టకస్’, ‘ది వైకింగ్స్’ వంటి చిత్రాలు 1950, 60 సంవత్సరాలలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను  సాధించాయి.

ఇంకా ‘యాస్‌ ఇన్‌ ద హోల్‌’, ‘డిటెక్టివ్‌ స్టోరీ’, ‘లోన్లీ ఆర్‌ ద బ్రేవ్‌’, ‘సెవెన్‌ డేస్‌ ఇన్‌ మే’, ‘పాత్‌ ఆఫ్‌ గ్లోరీ’, ‘గన్‌ఫైట్‌ ఎట్‌ ద ఓ.కె. కోర్రల్‌’, ‘ద హీరోస్‌ ఆఫ్‌ టెల్‌మార్క్‌’, ‘సటర్న్‌ 3’, ‘స్నో రివర్‌’, ‘టఫ్‌ గైర్సు’, ‘ద విలన్‌’, ‘ద ఫ్యూరీ’, ‘గ్రీడీ’, ‘ఆస్కార్‌’, ‘డ్రా’, ‘ఏ సెంచరీ ఆఫ్‌ సినిమా’, ‘డైమండ్స్‌’ వంటివి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలుగా నిలిచాయి. డగ్లస్ నలుగురు కొడుకుల్లో ఒక కొడుకు మరణించగా మిగతా ముగ్గురు కొడుకులు హాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కిర్క్ డగ్లస్ మృతికి పలువురు హాలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.