నందమూరి తారకరామారావు జీవిత భాగస్వామి లక్ష్మీపార్వతి కోణంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా “లక్ష్మీస్ ఎన్టీఆర్”. చంద్రబాబు వెన్నుపోటు కథాంశాన్ని తీసుకుని వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఏపీలో తప్ప మిగతా రాష్ట్రాలలో.. ఓవర్సీస్‌లో విడుదలైంది. ఎన్నో విమర్శలు మరెన్నో వివాదాలు కోర్టులు, కేసులు అనంతరం ఈ సినిమా మే 1వ తేదీన ఏపీలో కూడా విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో వర్మ సినిమాకు సంబంధించి ప్రమోషన్ చేసుకునేందుకు ఏపీకి వెళ్లగా అక్కడ పోలీసులు వర్మను అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వర్మను హైదరాబాద్‌కు పంపేయగా.. ఇవాళ(29 ఏప్రిల్ 2019) ఈ వివాదాలకు సంబంధించి ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో పెట్టారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్-2 ని కూడా తీస్తానంటూ వెల్లడించారు. కాగా పార్ట్-1లో ఎన్‌టీఆర్ చనిపోయినవరకు చూపించిన వర్మ పార్ట్-2లో ఏం చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.