సీనియర్ నటుడు మృతి.. సినీ పరిశ్రమలో విషాదం..

  • Publish Date - July 30, 2020 / 04:27 PM IST

2020లో మరీ ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ సమయంలో వివిధ భాషలకు చెందిన చిత్రపరిశ్రమల్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావు చనిపోయిన విషయం మరువక ముందే.. మరాఠీ సినీ నటుడు అశుతోష్ భక్రే(32) జూలై 29న ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచాడు.

ఇంతలోనే మరో సీనియర్ నటుడు మృతి చెందినట్లుగా వార్త వినాల్సి రావడం బాధాకరం. మలయాళ నటుడు అనిల్ మురళీ (56) కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో కన్నుమూశారు.

బుల్లితెర నుంచి 1993లో నటుడిగా అరంగేట్రం చేసిన అనిల్ మురళీ.. దక్షిణాదిన పలు చిత్రాలలో నటించారు. ‘క‌న్యాకుమారియిల్ ఒరు క‌విత’ అనేది ఆయన మొదటి చిత్రం. మలయాళం, తెలుగు, తిమళ్ భాషలలో ఆయన 200కు పైగా చిత్రాలలో నటించారు. తెలుగులో నేచురల్ స్టార్ నాని ‘జెండాపై కపిరాజు’ సినిమాలో నటించారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు తక్కువగా వస్తుండటంతో మళ్లీ సీరియల్స్‌లో బిజీ అయ్యారు. చివరిగా ఈ ఏడాది ‘ఫోరెన్సిక్’ అనే మలయాళ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా త్వరలో తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

 

 

అనిల్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించి, ఆయనతో అనుబంధం కలిగిన నటుడు, దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఇన్‌స్టాలో తన సంతాపాన్ని తెలిపారు. అనిల్ మురళీ మృతికి చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.