ఆమెకు మాటిచ్చాను.. అది తీరకుండానే.. చిరు భావోద్వేగం..

  • Publish Date - October 14, 2020 / 04:07 PM IST

Shobha Naidu: కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభా నాయుడు నృత్యానికి తన జీవితాన్ని అంకితం చేశారని, ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేనిదని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శోభా నాయుడు ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

“శోభానాయుడు మరణవార్త వినగానే నేను నిర్ఘాంతపోయాను. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కళాకారిణి ఆమె. ఆ స్థాయి కళాకారులు మళ్ళీ వస్తారా అనేది పెద్ద ప్రశ్నే. శ్రీ వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి. వారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రశంశించుకునే కళాకారులం.

ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన సమయంలో ఆమె చేసిన ఓ నృత్య గేయం కూడాను చూశాను. శారీరకంగా ఇబ్బంది ఉన్నా దాన్ని అధిగమించి సమాజం కోసం కరోనా గురించి స్పందించి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఆడారు పాడారు. కళాకారిణిగా ఆమెకు కళల పట్ల ఉన్న అభిమానం, సమాజం పట్ల ఉన్న అభిమానం ఏంటో అర్థమైంది. ఆమెకి వెంటనే నా ప్రశంశలు కోటి గారి ద్వార తెలిపాను. దానికి స్పందనగా ఆమె కూడ నాకు కృతజ్ఞతగా శుభాకాంక్షలు పంపించారు. అదే మా ఇద్దరి మధ్య జరిగిన ఆఖరి సంభాషణ.

వారు నన్ను కలవాలని కూడా అనుకున్నారు. నన్ను తనతో ఓ వేదిక మీద చూడాలని కూడా ఆమె అనుకున్నారు. ఈ గడ్డుకాలం అయిపోయాక మేం చేయబోయే మొదటి ప్రదర్శనకు మీరు, కోటి గారు అతిథులుగా రావాలి అని భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు.
తప్పకుండా వస్తానని కూడా వారికి చెప్పాను. అలాంటి శోభా నాయుడు ఈరోజు మనముందు లేకపోవడం దురదృష్టకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను…” అంటూ చిరు సంతాపం తెలియజేశారు..