Meghalu Cheppina Prema Katha Review
Meghalu Cheppina Prema Katha : నరేష్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మాణంలో విపిన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ఆగస్ట్ 22న థియేటర్స్ లో రిలీజయింది.(Meghalu Cheppina Prema Katha)
కథ విషయానికొస్తే.. వరుణ్(నరేష్ అగస్త్య)కు సంగీతం అంటే పిచ్చి. సంగీతంలో ప్రయోగాలు చేయాలని, పెద్ద సింగర్ అవ్వాలని, తన నానమ్మ(రాధికా శరత్ కుమార్) కల నెరవేర్చాలని అనుకుంటాడు. అందుకోసం వరుణ్ అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. కానీ వరుణ్ తండ్రి(సుమన్) బిజినెస్ చూసుకోమని, ఆర్ట్ ఫుడ్ పెట్టదని అదే కావాలంటే బయటకు వెళ్లిపొమ్మని అంటాడు. వరుణ్ చేసిన ఓ మ్యూజిక్ ఆల్బమ్ మ్యూజిక్ కంపెనీకి నచ్చలేదు అని చెప్పడంతో బెస్ట్ ఆల్బమ్ చేయడానికి తన నానమ్మ ఊరు వెళ్తాడు. అక్కడ తన ఎస్టేట్ చూసుకుంటూ మ్యూజిక్ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.
మేఘన(రబియా ఖతూన్) పనిచేసే కంపెనీలో ఆదిత్య(రాజా చెంబోలు) తనని లవ్ చేస్తున్నాడు అని ఫ్రెండ్స్ అంతా ఆమెకు నూరిపోస్తారు. ఇది నిజమేనేమో అనుకోని మేఘన ఆదిత్యకు ప్రపోజ్ చేస్తే అతను రిజెక్ట్ చేస్తాడు. దీంతో మేఘన టీమ్ లీడ్ అవ్వడంతో తన కొలీగ్స్ అందరికి ఫుల్ వర్క్ ఇస్తుంది. వాళ్లంతా మేనేజర్(హర్షవర్ధన్) వద్దకు వెళ్లి మొరపెట్టుకోవడంతో మేఘనకు హాలిడేస్ ఇస్తారు. ఈ క్రమంలో మేఘన వేల్పూరిలో ఉన్న వరుణ్ ఎస్టేట్ కి వస్తుంది. అక్కడ వీరిద్దరికి మంచి పరిచయం అయి వేల్పూరి అందాలు అన్ని చూస్తూ తిరుగుతారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా చెప్పకుండానే మేఘన వెళ్ళిపోతుంది. మరి మేఘన – వరుణ్ ప్రేమ ఓకే అయిందా? వరుణ్ సింగర్ అయ్యాడా? వరుణ్ నానమ్మ కల తీర్చాడా? వరుణ్ తండ్రి అర్ధం చేసుకున్నాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Paradha Review : ‘పరదా’ మూవీ రివ్యూ.. కొత్త ప్రయోగం చేసిన అనుపమ పరమేశ్వరన్..
మేఘాలు చెప్పిన ప్రేమ కథ అని అచ్చ తెలుగులో అందమైన టైటిల్ తో ఆకర్షించారు. సినిమా అంతా సంగీత నేపథ్యంలోనే నడుస్తుంది. కథ పరంగా చూసుకుంటే హీరో సక్సెస్ అవ్వాలి, మధ్యలో హీరోయిన్ ప్రేమ.. అనే సింపుల్ కథ. కానీ దానికి ఆల్మోస్ట్ చాలా సీన్స్ లో సంగీతాన్ని జోడించి అందంగా చూపించే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో కాస్త బాగానే సాగదీశారు కూడా. హీరో హీరోయిన్ పాత్రల గురించి వాళ్లకు వాళ్లే కూర్చొని ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడంతో కాస్త స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్ వస్తుంది.
శాస్త్రీయ సంగీతం ఇష్టం ఉన్నవాళ్లకు మాత్రం సినిమాలో వచ్చే సంగీతం, పాటలు, సీన్స్ బాగా నచ్చుతాయి. అయితే అసలు కథ వదిలేసి కొన్ని సీన్స్ సంగీతం చుట్టే తిప్పడంతో సాగదీస్తున్నాడు అనే ఫీలింగ్ రాక తప్పదు. అక్కడక్కడా వెంకటేష్ కాకుమానుతో ట్రై చేసిన కామెడీ పండకపోయినా హీరోయిన్ ఆఫీస్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో సినిమాని ముగించేయొచ్చు కానీ మళ్ళీ సాగదీశారు అనిపిస్తుంది. టైటిల్ మేఘాలు చెప్పిన ప్రేమ కథ సినిమాకు సెట్ అవ్వాలని అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ అయితే వాడారు.
నరేష్ అగస్త్య ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో చక్కగా మెప్పించాడు. తమిళ భామ రబియా ఖతూన్ ప్రతి ఫ్రేమ్ లో అందంగా కనిపిస్తూ క్యూట్ గా అల్లరిచేస్తూ చక్కగా నటించి అలరించింది. మలయాళ గొప్ప సంగీత విధ్వాంసులు అశ్వతీ తిరునాళ్ రామవర్మ గెస్ట్ పాత్రలో అలరించారు. రాధికా శరత్ కుమార్ హీరో నానమ్మ పాత్రలో సంగీతాన్ని అవపోసన పట్టిన మహిళగా ఫ్లాష్ బ్యాక్ లో కాసేపు కనిపించి అలరించారు. హర్ష వర్ధన్ కాస్త నవ్వించాడు. యూట్యూబర్ విరాజిత ఓ చిన్న పాత్రలో తళుక్కుమనిపిస్తుంది. సుమన్, ఆమని, వెంకటేష్ కాకుమాను, తనికెళ్ళ భరణి, పర్ణిక, మోహన్ రమణ.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Veerabhimani : ‘వీరాభిమాని’ రివ్యూ.. చిరంజీవి కోసం యమలోకానికి వెళ్లిన అభిమాని.. కాన్సెప్ట్ మాములుగా లేదుగా..
సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి. తమిళనాడులోని టీ ఎస్టేట్, అక్కడ గ్రామాల్లో షూటింగ్ చేయడంతో ప్రతి ఫ్రేమ్ ని అందంగా చూపించారు. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో కథకు తగ్గట్టు మంచి మెలోడీ సంగీతం ఇచ్చారు. పాటలు బాగానే ఉన్నాయి. సింపుల్ కథని దర్శకుడు మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో కాస్త ల్యాగ్ చేసి రాసుకున్నాడు. అచ్చ తెలుగులో ప్రేమ, సంగీతం గురించి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ లో ఇంకాస్త ఎడిట్ చేసి కొన్ని సీన్స్ తీసేయాల్సింది. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది.
మొత్తంగా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ సంగీతం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు నచ్చేవాళ్లకు ఇది బాగానే నచ్చుతుంది. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.