కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు అన్నారు. అందులో సూరిది కసాయి (మేక తోలు వలిచి, మాంసం కొట్టే) వృత్తి. ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తున్న సూరి, అవలీలగా నిమిషాల్లో మేక తోలు వలిచి ముక్కలు కొట్టేస్తాడు. దాంతో అతడి పేరు ‘మేక సూరి’ అయిపోయింది. అతడి ఊరిలో రాణి అనే అందమైన అమ్మాయి ఉంటుంది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ ఊరిలో మూతి మీద మీసం వచ్చిన కుర్రాడి నుంచి మీసాలకు రంగు వేసుకునే ముసలోళ్ల వరకూ అందరి కన్ను రాణి మీదే! మగజాతి మనసు దోచిన రాణి ఓ రోజు హత్యకు గురవుతుంది. ఆమెను చంపింది ఎవరు? అందుకు కారణమైన వ్యక్తులపై సూరి ఎలా పగతీర్చుకున్నాడనేది ‘మేక సూరి’ వెబ్ సిరీస్ స్టోరీ. దీనికి సంబంధించిన ఫస్ట్ పార్ట్ ఈ నెల 31న ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను యంగ్ హీరో నారా రోహిత్ విడుదల చేశారు. ‘‘క్రైమ్ జానర్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘మేక సూరి’ ట్రైలర్ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ్ వెలిశిలకు, అలాగే జీ5 వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని నారా రోహిత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.