సోనాక్షికి శక్తిమాన్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇన్‌డైరెక్ట్‌గా ఇంకొందరిపై..

‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేశ్ ఖన్నా కథానాయిక సోనాక్షి సిన్హాపై విమర్శలు గుప్పించారు..

  • Publish Date - April 4, 2020 / 02:41 PM IST

‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేశ్ ఖన్నా కథానాయిక సోనాక్షి సిన్హాపై విమర్శలు గుప్పించారు..

కోవిడ్-19ను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో.. దూరదర్శన్‌లో ‘రామాయణ్’, ‘మహాభారత్’ ధారావాహికలను తిరిగి ప్రసారం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేశ్ ఖన్నా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని, సోనాక్షి సిన్హా లాంటి వాళ్లకు ఈ సీరియళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుత తరం కొత్త పోకడలకు ఎక్కువగా ఆకర్షితమవుతోందని, దాని మోజులో పడి మన ఇతిహాసాలు, చరిత్రను మరచిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒకసారి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంకు విచ్చేసిన సోనాక్షి సిన్హా రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన సంగతి తెలిసిందే. హనుమంతుడు ఎవరికోసం సంజీవనిని  తీసుకువచ్చారని అమితాబ్ బచ్చన్ అడ్డగ్గా దానికి ఆమె సమాధానం చెప్పలేక తిప్పలు పడింది. సోషల్ మీడియాలో సోనాక్షిని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనను ఎత్తి చూపుతూనే ముఖేశ్ ఖన్నా ప్రత్యక్షంగా సోనాక్షి లాంటి వాళ్లపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువ నిర్మాత ఏక్తా కపూర్ ‘మహాభారత్’ ను పరిహాసం చేస్తూ సీరియల్స్ నిర్మించడం వంటి పలు అంశాలను ప్రేక్షకులకు గుర్తుకు తెచ్చారు ముఖేశ్..

ఇదిలా ఉంటే దూరదర్శన్‌లో ‘రామాయణ్’, ‘మహాభారత్’ మాత్రమే కాకుండా అప్పటి చిన్నారులు ఎంతగానో మెచ్చిన శక్తిమాన్‌ సీరియల్‌ను కూడా తిరిగి ప్రసారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ప్రేక్షకులకు ఈ అద్భుతమైన ధారావాహికలు మళ్లీ చూసే అవకాశం లభించింది.

Read Also : భళారే బామ్మ.. నీ ముందు భామలు కూడా బలాదూరేనమ్మా..