ఎల్‌బి శ్రీరామ్ ‘కళ్లద్దాలు’ చూశారా!..

ఆకట్టుకుంటూ ఆలోచింపచేస్తున్న ఎల్.‌బి.శ్రీరాం ‘నా కళ్లద్దాలు’..

  • Publish Date - May 2, 2020 / 04:15 PM IST

ఆకట్టుకుంటూ ఆలోచింపచేస్తున్న ఎల్.‌బి.శ్రీరాం ‘నా కళ్లద్దాలు’..

సీనియర్ నటులు, రచయిత, దర్శకులు ఎల్‌.బి. శ్రీరామ్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటూ.. చిన్న చిన్న లఘు చిత్రాలను తనదైన తరహాలో రూపొందిస్తూ.. సమాజం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆయన చేసే లఘు చిత్రాలలో ఎటువంటి అశ్లీలతకు చోటుండదు. చక్కగా ఒక సమస్యను తెలిపి, దానికి పరిష్కారం కూడా ఆయన చూపిస్తుంటారు. అందుకే ఆయన సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయ్యారు. తాజాగా ఆయన కరోనాపై అవగాహన కల్పించడానికి ఓ లఘు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ లఘు చిత్రం ఎంత ఎక్కువ మందికి చేరితే అంత ఆనందపడతానని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నమస్కారం.. ‘నా కళ్ళద్దాలు’ అనే ఈ నా కరోనాపై అవగాహన లఘు చిత్రం.. మనిషి మనుగడకీ, దేశ క్షేమానికీ ఉద్దేశించినది కాబట్టి.. దీన్ని ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే అంత ఉపయోగం ఉంటుంది. కనుక ఈ నా చిన్ని చిత్రాన్ని టీవీ, రేడియో, సోషల్ మీడియాల్లాంటి ఏ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ మాధ్యమాల్లోనైనా యధాతధంగా గానీ, తర్జుమా చేసిగానీ.. పూర్తిగా గాని, కొన్నికొన్ని భాగాలుగా గానీ, ఎన్నిసార్లైనా గానీ ఉపయోగించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ‘నా కళ్ళద్దాలు’ అందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకూడదని ఇది నా సమ్మతిపత్రంగా భావించవచ్చుననీ హామీ ఇస్తున్నాను..’’ అని ఎల్‌.బి.శ్రీరామ్ పేర్కొన్నారు. ఆకట్టుకుంటూ ఆలోచింపచేస్తున్న ఎల్.‌బి.శ్రీరాం ‘నా కళ్లద్దాలు’.. చూసి ఆనందించండి..