దసరా కానుకగా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నర్తనశాల’ ఈ నెల 24న విడుదల..

  • Publish Date - October 19, 2020 / 04:50 PM IST

Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నర్తనశాల’.. బాలయ్య స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలనుకుని 2004లో చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. సౌందర్య మరణంతో బాలయ్య ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. నటరత్న నందమూరి తారక రామారావు నటించిన క్లాసిక్ మూవీ ‘నర్తనశాల’ను తనయుడు బాలయ్య భారీ తారాగణంతో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు తెరకెక్కించడంతో నందమూరి అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇన్నాళ్లకు ఈ సినిమా విడుదల కానుంది.

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ అర్జునుడిగా, సౌందర్య ద్రౌపదిగా, శ్రీహరి భీముడిగా, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.



ఈ చిత్రం NBK Theatre లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదలవుతోందని బాలయ్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌‌కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో ‘నర్తనశాల’ కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నెరవేరబోతోండటంతో నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.