Newton’s 3rd Law Review : ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ.. సుమంత్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉంది..?

సుమంత్ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తుండటం, టైటిల్ కూడా కొత్తగా ఉండటంతో ఈ న్యూటన్స్‌ థర్డ్‌ లా సినిమాపై ఆసక్తి నెలకొంది. (Newton's 3rd Law Review)

  • Updated on- July 31, 2026 / 12:58 AM IST

Newton's 3rd Law Review

Newton’s 3rd Law Review : సుమంత్‌ హీరోగా, త్రినాథ్ వర్మ, రవివర్మ, షెల్లీ కుమార్, నేహా పఠాన్, జగపతిబాబు.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. ఈటీవీ విన్ సమర్పణలో కె.హరీశ్‌ నిర్మాణంలో రాజేశ్‌ కర్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా జులై 31న థియేటర్లలో రిలీజ్ అవుతుండగా ముందు రోజే స్పెషల్ ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

డేవిడ్(అవసరాల శ్రీనివాస్)కి న్యూటన్స్‌ థర్డ్‌ లా అనే ఒక పుస్తకం కొరియర్ లో వస్తుంది. ఆ బుక్ తీసి అందులో కథ చదువుతుంటే అది రియల్ గా జరిగిందని, ఆ కథకు తనకు సంబంధం ఉందని తెలుస్తుంది.

ఆ కథ 1990ల్లో జరుగుతుంది. భర్త చనిపోయాడని కూతురుతో కలిసి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగి జ్యోతి(నేహా పఠాన్)మరణిస్తుంది. అది జరిగిన కొన్ని రోజులకే వినయ్(త్రినాథ్ వర్మ) బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంటాడు. ఆ కేసు డీల్ చేయడానికి పోలీస్ వాసుదేవ్(సుమంత్) వస్తాడు. అది సూసైడ్ కాదు మర్డర్ అని, తలలో బుల్లెట్ ఉందని పోస్టుమార్టం రిపోర్ట్ లో రావడంతో వాసుదేవ్ తన విచారణ మొదలుపెడతాడు. వినయ్ తల్లితండ్రులు ఏదో తప్పు చేసారు కానీ అది దాస్తున్నారని వాసుదేవ్ కనిపెడతాడు. అలాగే వినయ్ చనిపోయేముందు అతను కూడా ఏదో తప్పు చేసాడని తెలుస్తుంది.

వినయ్ చనిపోయిన తర్వాత అతని ఫ్రెండ్ కార్తీక్(గౌతమ్ పండిట్) మిస్ అవుతాడు. జ్యోతి యాక్సిడెంట్ కేసు కూడా వాసుదేవ్ దగ్గరికి వస్తుంది. అసలు జ్యోతి యాక్సిడెంట్ కి, వినయ్ మర్డర్ కి సంబంధం ఏమైనా ఉందా? అసలు ఈ రెండు ఎలా జరిగాయి? యాక్సిడెంట్, మర్డర్ ఎవరు చేసారు? వినయ్ చనిపోయేముందు ఏం తప్పు చేసాడు? వినయ్ పేరెంట్స్ ఏం దాస్తున్నారు? అసలు న్యూటన్స్‌ థర్డ్‌ లా బుక్ రాసింది ఎవరు? డేవిడ్ ఎవరు? ఆ బుక్ ని చూసి డేవిడ్ ఎందుకు భయపడ్డాడు? ఈ కథలో స్టీఫెన్ మెర్క్యురీ(జగపతిబాబు) పాత్ర ఏంటి? ఈ న్యూటన్స్‌ థర్డ్‌ లా సూత్రం ఈ కథలో ఎలా పనిచేసింది.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Second Marriage Review : ‘సెకండ్ మ్యారేజ్’ వెబ్ సిరీస్ రివ్యూ.. భార్యాభర్తలు చూడాల్సిందే.. శోభనం రాత్రి సీన్‌తో మొదలుపెట్టి..

సినిమా విశ్లేషణ..

సుమంత్ గత కొన్నేళ్లుగా ఆచితూచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అనగనగా సినిమాతో హిట్ కొట్టిన సుమంత్ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తుండటం, టైటిల్ కూడా కొత్తగా ఉండటంతో ఈ న్యూటన్స్‌ థర్డ్‌ లా సినిమాపై ఆసక్తి నెలకొంది.

డేవిడ్ కి న్యూటన్స్‌ థర్డ్‌ లా పుస్తకం రావడం 2026లో చూపించి అది చదువుతూ 1990 కథలోకి వెళ్లడం చూపించారు. ఓపెనింగ్ లోనే జ్యోతి యాక్సిడెంట్, వినయ్ సూసైడ్ చూపించి అవి అందుకు జరిగాయి అనే ఆసక్తితో కథ మొదలుపెడతారు. దాంతో ఓపెనింగ్ సీన్ తోనే ఆసక్తి నెలకొంటుంది. వాసుదేవ్ వచ్చాక ఇన్వెస్టిగేషన్ కాసేపు ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. ఓ పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే దానికి లింక్ అయి ఉన్న సంఘటనలను చూపిస్తూ ఉంటారు. అలా ఆ ఇన్వెస్టిగేషన్ కొంత సాగదీసి అసలు విషయాలు చెప్పకుండా సగం కథ చూపించి ఇంటర్వెల్ కి ఒకర్ని అరెస్ట్ చేసినట్టు చూపించి చాలా ప్రశ్నలు వదిలేసారు.

ఇక సెకండ్ హాఫ్ లో వినయ్, కార్తీక్ ఫ్లాష్ బ్యాక్, ఓ క్రైమ్ బాగా సాగదీసి చూపించి ఫస్ట్ హాఫ్ లో మిగిలిన ప్రశ్నలు అన్నిటికి ఒక్కొక్కటిగా సమాధానాలు ఇస్తారు. సెకండ్ హాఫ్ లో కూడా వాసుదేవ్ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. క్లైమాక్స్ వరకు సాగదీసి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయి అనుకుంటే చివర్లో ఒకేసారి ట్విస్ట్ లు అన్ని రివీల్ చేసి కాస్త కన్ఫ్యూజ్ చేస్తారు.

ఫస్ట్ హాఫ్ కొంత సాగదీత, విచారణతో బాగానే సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఫ్లాష్ బ్యాక్ బాగా సాగదీశారు. క్లైమాక్స్ లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వాసుదేవ్ పాత్రకు సరైన ముగింపు, క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఆ పాత్ర ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఈ కథ ముగిసినా పార్ట్ 2 కి ఛాన్స్ లేకపోయినా చివర్లో పార్ట్ 2కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ఓ క్రైమ్ సస్పెన్స్ సినిమాని ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ప్రస్తుతం, గతం చూపిస్తూ కాస్త కన్ఫ్యూజ్ గా తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలు, స్క్రీన్ ప్లే కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాలు ఉన్నాయి. ఒక యాక్షన్ జరిగితే దానికి రియాక్షన్ ఉంటుంది అనే న్యూటన్స్‌ థర్డ్‌ లా సూత్రం ఈ కథకు ఎలా అప్లై చేసారో చివర్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది. 1990 ల్లో కథ జరుగుతుంటే కొన్ని సీన్స్, ప్రాపర్టీ మాత్రం 2000 తర్వాత అన్నట్టు కనిపిస్తుంది. పెద్దలు సరిగ్గా లేకపోతే ఇంట్లో పిల్లలు ఎలా తప్పుదారి పడతారు అనే ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. సస్పెన్స్ సినిమాలు చూసేవాళ్ళు ఒకసారి చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

సుమంత్ పోలీస్ గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో తక్కువ మాట్లాడుతూ బాగానే మెప్పించాడు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న త్రినాథ్ వర్మ ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించాడు. త్రినాథ్ వర్మ ఫ్రెండ్ పాత్ర చేసిన గౌతమ్ పండిట్ మాత్రం తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. వినయ్ తల్లి పాత్రలో నటించిన షెల్లీ కుమార్ కూడా తన నటనతో మెప్పిస్తుంది. నేహా పఠాన్ బాగానే నటించింది. జగపతి బాబు గెస్ట్ పాత్రలో అక్కడక్కడా కనిపించారు. అవసరాల శ్రీనివాస్, రవివర్మ, హరిణి రావు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

Also Read : Srinivasa Mangapuram Review : ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ రివ్యూ.. మహేష్ అన్న కొడుకు హీరోగా మెప్పించాడా?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం అన్ని పాత సినిమాల్లో పాటల్లా, అవే ట్యూన్స్ తో ఉన్నాయి. పాటలు అంతగా మెప్పించవు. స్టోరీ రొటీన్ క్రైమ్ సస్పెన్స్ అయినా స్క్రీన్ ప్లే మాత్రం బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఎడిటింగ్ లో చాలా సీన్స్, సెకండ్ హాఫ్ లో ఓ సాంగ్ కట్ చేయొచ్చు. అవి తప్ప స్క్రీన్ ప్లేకి తగ్గట్టు మిగతా సినిమా అంతా ఎడిటింగ్ బాగుంది. 1990లో కథ కావడంతో దానికి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ ప్రాపర్టీ, కొన్ని సీన్స్ కనిపించేలా సెట్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఇంకాస్త జాగ్రత్తగా చేసుకోవాల్సింది. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ ఒక యాక్షన్ జరిగితే దానికి సమానమైన రియాక్షన్ ఉంటుంది అనే సిద్ధాంతం ప్రకారం ఇద్దరు చావులు ఎలా అయ్యాయి, వాటికి రియాక్షన్ ఏం వచ్చింది, వీటి మధ్య జరిగిన క్రైమ్, సంఘటనలు ఏంటి అని ఆసక్తికర స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.