Peddi: ‘పెద్ది’ సినిమాకు ఎగ్జిబిటర్ల షాక్.. పర్సంటేజ్ ఇస్తేనే థియేటర్లలో ప్రదర్శన.. అల్టిమేటం జారీ
రామ్ చరణ్ పెద్ది(Peddi) సినిమా విడుదలకు మళ్ళీ మొదలైన కష్టాలు.
- V Santhosh Kumar
- Published on- May 23, 2026 / 04:15 PM IST
Percentage system must start from Peddi movie_ Telangana Exhibitors Ultimatum.
- ‘పెద్ది’ సినిమాకు పర్సంటేజ్ విధానం కావాలి.
- ఎగ్జిబిటర్ల డిమాండ్‌తో ‘పెద్ది’కి చిక్కులు.
- కండిషన్స్ ఒపితేనే ‘పెద్ది’ ప్రదర్శన.
Peddi: తెలుగు ఫిలిం చాంబర్‌లో తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్వహించిన కీలక సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి విజయేందర్ రెడ్డి, సెక్రటరీ శ్రీధర్, బాలగోవింద్ రాజ్ తదితర ప్రముఖ ఎగ్జిబిటర్లు హాజరై థియేటర్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా సమయంలో సమస్యలను పరిష్కరిస్తామని కమిటీ హామీ ఇచ్చిందని, కానీ ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు. రాబోయే ‘పెద్ది(Peddi)’ సినిమా నుండి తమకు కచ్చితంగా పర్సంటేజ్ విధానం కావాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్మాతలు కావాలనే గ్రేడింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని, పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేస్తేనే థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు.
గతంలో థియేటర్లకు మంచి ఆదాయం ఉండేదని, కానీ ప్రస్తుతం 120 మందికి పైగా థియేటర్ ఓనర్లు దయనీయ పరిస్థితిలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలకు ఓటీటీ, శాటిలైట్ వంటి 14 రకాలుగా ఆదాయం వస్తోందని, కానీ ఎగ్జిబిటర్లు మాత్రం నష్టపోతున్నారని పేర్కొన్నారు. దేశమంతటా పర్సంటేజ్ విధానం ఉన్నప్పుడు ఇక్కడ మాత్రమే రెంటల్ సిస్టమ్ ఎందుకని, ఎంత శాతం ఇస్తారో నిర్మాతలు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
