టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే.. (స్పెషల్ స్టోరి)..
ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అనే సామెత అందరికీ తెలిసిందే. సినిమా రంగంలో కాస్త గ్లామర్, కొంచెం టాలెంట్ ఉంటే చాలు హీరోయిన్లు ఎలాగోలా బండి లాగించేస్తారు అనుకుంటుంటారు చాలామంది.. తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అనేది సినీ జనాలు చెప్పే మాట.. రెండు, మూడు ఫ్లాప్స్ పడితే ఆ హీరోయిన్‌కి ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర వేసేస్తారు. అదే రెండు, మూడు హిట్ సినిమాలు పడితే ‘గోల్డెన్ లెగ్’ అని పొగిడేస్తారు. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఇప్పుడు హిట్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరింది.. పూజా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ సారి ఆమె సినీ కెరీర్‌ని పరిశీలిస్తే..
పూజా పేరెంట్స్.. మంజునాధ్ హెగ్డే, లత హెగ్డే కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన వారైనా.. పూజా పుట్టి పెరిగింది మాత్రం ముంబాయిలో.. కాలేజీ రోజుల్లోనే డ్యాన్స్, ఫ్యాషన్ షోలలో పార్టిసిపేట్ చేసింది.
‘ముగమూడి’ అనే తమిళ సినిమాతో పూజా సినీ జర్నీ స్టార్ట్ అయింది. జీవా హీరో కాగా మిస్కిన్ డైరెక్ట్ చేశాడు. తర్వాత తెలుగులో నాగ చైతన్య సరసన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ముకుంద’ లోనూ ఆకట్టకుంది. ఇంతలో హిందీలో హృతిక్ రోషన్ పక్కన ‘మొహంజోదారో’ లో అవకాశం రాగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్‌కి వెళ్లింది.
అల్లు అర్జున్ పక్కన ‘డీజే’ లోనూ నటించింది. పూజా పాపకి హీరోయిన్‌గా రాని బ్రేక్, క్రేజ్ ‘రంగస్థలం’ లో జిగేలు రాణి పాటతో వచ్చేశాయి. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన ‘సాక్ష్యం’ డిజాస్టర్ అయినా.. ‘అరవింద సమేత’ లో అవకాశంతో పాటు కథానాయికగా ఫస్ట్ హిట్ అందించాడు దర్శకుడు త్రివిక్రమ్.. సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ తో మరో కమర్షియల్ హిట్ ఖాతాలో వేసుకున్న పూజా.. వరుణ్ తేజ్‌తో రెండోసారి నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతోనూ అలరించింది. హిందీలో ‘హౌస్‌ఫుల్ 4’ లో అక్షయ్ కుమార్ పక్కన ఆడిపాడింది.
తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో సూపర్ హిట్ తన అకౌంట్‌లో వేసుకుంది. దీంతో ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఐరన్ లెగ్ అన్నవాళ్లే.. పూజాను ఇప్పుడు గోల్డెన్ లెగ్ అని పొగుడుతున్నారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ కథనాయికగా నటిస్తోంది పూజా హెగ్డే.