Posani Krishna Murali
Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సినీ, రాజకీయ పరంగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. సినిమాల్లో రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన పోసాని.. దాదాపు 150 పైగా సినిమాలకు రచయితగా పని చేశాడు. అలాగే దర్శకుడిగా కూడా అనేక చిత్రాలు తెరకెక్కించాడు. ఇప్పటి స్టార్ డైరెక్టర్స్ బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్ పోసాని దగ్గర శిష్యరికం చేసిన వారే. నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించిన పోసాని.. ప్రస్తుతం నటుడిగా స్థిరపడ్డాడు.
ఇక రాజకీయంలో ఎప్పటి నుంచో యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న పోసాని ఇటీవల.. ఏపీ గవర్నమెంట్ లో పోస్ట్ సంపాదించుకున్నాడు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి చేపట్టిన పోసాని ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను అభిమానులతో పంచుకున్నాడు. “నేను బాగా చదువుకున్నాను. మంచి ఉద్యోగం వచ్చేలా ఉందని నాకు మంచి పెళ్లి సంబంధాలు వచ్చేవి. కానీ నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి వచ్చిన సంబంధాలు అని చెడగొట్టేవారు కొంతమంది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు.
చాలా కోపం వచ్చేది వాళ్ళ పై, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా? కానీ వాళ్ళు చేసే పనులకు ఒకానొక సమయంలో సహనం చచ్చి వాళ్ళని చంపడానికి పుస్తకాల్లో కత్తి పెట్టుకొని తిరిగేవాడిని” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తన అమ్మకి బంగారపు గాజులు, నాన్నకి బంగారపు ఉంగరం కొనిపెట్టాలని, వాళ్ళ ఇద్దర్ని కారులో ఎక్కించుకొని తిప్పాలని కలలు కనే వాడని. కానీ అవేవి తీరకుండానే వాళ్ళు వెళ్లిపోయారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.