ప్రభాస్‌ నటించే నెక్ట్స్‌ సినిమా అల్లూరి బయోపిక్కేనా?

ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలో చరణ్‌ అల్లూరి పాత్ర పోషించినా, అది మన్యం వీరుడి బయోపిక్‌ కాదు.

ప్రభాస్‌ నటించే నెక్ట్స్‌ సినిమా అల్లూరి బయోపిక్కేనా?

prabhas

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు బ‌యోపిక్‌లో డార్లింగ్ ప్రభాస్ న‌టించే ఛాన్స్ ఉందా? ప్రభాస్‌ని సీతారామ‌రాజుగా చూడాల‌న్న దివంగత నటుడు రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు కోరిక నెరవేరబోతోందా? గోపీకృష్ణ బ్యానర్‌లో ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామాలాదేవి నిర్మాతగా అల్లూరి బయోపిక్‌ తెరకెక్కబోతోందని…. ఆ సినిమాలో అల్లూరి పాత్రను ప్రభాసే చేస్తాడనే టాలీవుడ్‌ టాక్‌లో నిజమెంత?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఎలాంటి రోల్‌లో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫిక్చర్స్‌ చేస్తూ పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగారు ప్రభాస్‌. ఇప్పుడు కల్కి సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టిన ప్రభాస్‌.. త్వరలో మన్యం వీరుడు అల్లూరి పాత్రలో నటించనున్నారని టాలీవుడ్‌ టాక్‌. ఈ టాపిక్‌పై ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తాజాగా చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. ఇటీవ‌ల జ‌రిగిన అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో సీతారామ‌రాజు బ‌యోపిక్‌పై ఆస‌క్తిక‌ర చర్చ జరిగింది.

‘అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రభాస్ చేస్తే, సీతారామరాజు మళ్లీ పుట్టినట్లు ఉంటుందని… అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రభాస్‌ను చూడాలని చాలామంది అభిమానులు కోరుతున్నారట… ఇదే విషయంపై కొంతమంది అభిమానులు శ్యామలాదేవి దృష్టికి సైతం తీసుకువెళ్లారంటున్నారు. అభిమానుల సూచనలను ప్రభాస్‌కు చెబుతానని… మన్యం వీరుడి పాత్రలో ప్రభాస్‌ను చూడాలని తనకు కూడా కోరిక ఉందని చెప్పారట శ్యామలాదేవి. దీంతో ప్రభాస్‌ నటించే నెక్ట్స్‌ సినిమా అల్లూరి బయోపిక్కేనా? అన్న చర్చ మొదలైంది.

కృష్ణంరాజు ఎంపీగా ఉండగా..
వాస్తవానికి రెబల్‌స్టార్‌ కృష్ణంరాజుకి అల్లూరి అంటే చాలా ఇష్టం. కృష్ణంరాజు ఎంపీగా ఉండగా, పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని చాలా ప్రయత్నించారు. కృష్ణంరాజు బతికి ఉండగా కూడా ప్రభాస్‌తో అల్లూరి పాత్రతో సినిమా చేయించాలని చూశారు. బాహుబలి తర్వాత మన్యం వీరుడి బయోపిక్‌ వస్తుందని అప్పట్లో చర్చ జరిగింది. కానీ, ఎందుకనో ఈ టాపిక్‌ అలా తెరమరుగైంది. కృష్ణంరాజు మరణం తర్వాత కొన్నాళ్లుగా ఈ చర్చ ఎక్కడా జరగలేదు. కానీ, ఇప్పుడు అల్లూరి జయంతి వేడుకల సందర్భంగా మరోసారి చర్చ జరిగింది. శ్యామలాదేవే స్వయంగా చెప్పడంతో ప్రభాస్‌ ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

మ‌న్యం వీరుడి పాత్రకు డార్లింగ్ ఎస్ చెబితే మాములుగా ఉండ‌దంటున్నారు అభిమానులు. గతంలో సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లూరి బ‌యోపిక్‌ని తెర‌కెక్కించారు. తాను మాత్రమే సీతారామ‌రాజు బ‌యోపిక్‌కి అర్హుడ‌ని ప్రేక్షకుల నీరాజ‌నాలు అందుకున్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సీతారామ‌రాజు క‌థ‌ని తీసే సాహ‌సం ఏ ద‌ర్శకుడు తీయ‌లేదు. ఇక ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలో చరణ్‌ అల్లూరి పాత్ర పోషించినా, అది మన్యం వీరుడి బయోపిక్‌ కాదు. దీంతో ఎలాగైనా ప్రభాస్‌ అల్లూరి పాత్ర చేయాలని డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రభాస్ ఒకే చెప్పి అల్లూరి సీతారామ‌రాజు సినిమా చేస్తే మరో హిట్‌ కొట్టినట్టేనంటున్నారు అభిమానులు.

Also Read: లావణ్యపై హీరోయిన్ మాల్వీ ఫిర్యాదు.. రాజ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్న నటి