U19 World Cup 2026: అండర్ 19 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్
అఫ్ఘానిస్తాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
U19 World Cup 2026 Representative Image (Image Credit To Original Source)
U19 World Cup 2026: అండర్-19 వరల్డ్ కప్ లో మన కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. భారత్ కు తిరుగులేని విజయాలు అందిస్తున్నారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ (115) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. విధ్వంసకర బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీలతో మెరిశారు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశారు. ఇక, రికార్డ్ స్థాయి ఛేజింగ్ తో ఫైనల్లోకి దూసుకెళ్లింది భారత యువ జట్టు.
సెమీస్ లో అప్ఘానిస్తాన్ పై ఘన విజయంతో భారత్ మరో ఘనత సాధించింది. అండర్ 19 ప్రపంచ కప్‌లో అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆరోన్ జార్జ్ అద్భుతమైన సెంచరీతో హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన మ్యాచ్‌లో 311 పరుగుల భారీ లక్ష్యాన్ని సులభంగా చేజ్ చేసి ఫైనల్‌కు చేరుకుంది. జార్జ్ సెంచరీతో చెలరేగగా.. వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే అర్ధ సెంచరీలతో మెరిశారు. దీంతో చేతిలో మరో 7 వికెట్లు, 53 బంతులు మిగిలి ఉండగానే భారత్ విక్టరీ కొట్టింది. U19 ప్రపంచ కప్ చరిత్రలో ఇదే అత్యధిక ఛేజింగ్. 2006లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ చేసిన 305 పరుగుల రికార్డ్ ను భారత్ బ్రేక్ చేసింది. ప్రపంచ కప్ నాకౌట్లో ఇప్పటివరకు అత్యధిక ఛేజింగ్ 245. ఇది కూడా ఇండియా పేరు మీదే ఉంది. 2024 సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై చేసింది.
జార్డ్ సూపర్ సెంచరీ..
ఓపెనర్ జార్జ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వైభవ్ సూర్యవంశీతో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ స్టాండ్ తో భారత్ కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. సూర్యవంశీ ఈజీ క్యాచ్ ఇచ్చి ఔట్ అవ్వగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే.. జార్జ్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. కీలకమైన మిడిల్ ఓవర్ల దశలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 2వ వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఆయుష్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన విహాన్ మల్మోత్రా.. జార్జ్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఈ టోర్నమెంట్లో జార్జ్ తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. 104 బంతుల్లో 115 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే భారత్ గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది. విజయానికి 11 పరుగులే అవసరం. విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేదీ జోడీ ఆ పరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించారు.
కీలక మ్యాచ్ లో సెంచరీ..
అఫ్ఘానిస్తాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు పెద్దగా రాణించని ఆరోన్ జార్జ్ కీలకమైన సెమీస్‌లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68) మెరుపు ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే (59 బంతుల్లో 62) కూడా వేగంగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
భారత ఛేదనలో భాగస్వామ్యాలు కీ రోల్ ప్లే చేశాయి. తొలి వికెట్‌కు జార్జ్, సూర్యవంశీ 90 పరుగులు జోడించగా.. రెండో వికెట్‌కు జార్జ్, కెప్టెన్ మాత్రే కలిసి 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక మూడో వికెట్‌కు విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38 నాటౌట్)తో కలిసి జార్జ్ మరో 96 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫైసల్ షినోజాడా (93 బంతుల్లో 110), ఉజైరుల్లా నియాజీ (86 బంతుల్లో 101 నాటౌట్) అద్భుత సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 148 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. ఫిబ్రవరి 6న ఇదే వేదికపై జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఓవరాల్ గా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించడం ఇది 10వ సారి కాగా.. వరుసగా 6వసారి తుదిపోరుకు చేరడం విశేషం.
