కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ కమిషన్‌ను వేయడం వెనుక కూటమి ప్లానేంటి?
సుప్రీం ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ సిట్ దర్యాప్తు జరిపింది. భోలేబాబా డెయిరీ తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి 68 లక్షల కిలోల నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసిందని గుర్తించింది.
AP Cabinet
- ఎన్నో మలుపులు తిరిగిన కల్తీ నెయ్యి ఎపిసోడ్
- విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం
- సిట్ తేల్చిందేంటి? విచారణ కమిషన్ ఏం తేల్చబోతోంది?
Tirumala Laddu: ఏడాదిగా అదే రచ్చ. తిరుమల శ్రీవారి లడ్డూ చుట్టే చర్చ. కల్తీ నెయ్యిలో..జంతువుల ఫ్యాట్స్ అంటూ..లోకల్ టు నేషనల్ టాపిక్ అయి పెద్ద ఇష్యూ అయ్యింది. కల్తీ నెయ్యి మ్యాటర్ పెద్ద కాంట్రవర్సీ టాపిక్‌గా కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పటి ప్రభుత్వంలోని నేతలకు, టీటీడీ పాలకులకు కల్తీ నెయ్యి మరకలు అంటాల్సినదానికంటే ఎక్కువే అంటాయి. కట్ చేస్తే లేటెస్ట్గా సుప్రీంకోర్టు వేసిన స్పెషల్ సిట్ ఇచ్చిన రిపోర్ట్‌తో ఇప్పుడు కొత్త రచ్చ స్టార్ట్ అయింది.
శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని స్పెషల్ సిట్ రిపోర్ట్ ఇచ్చిందని వైసీపీ పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ఓవైపు సోషల్ మీడియాలో..మరోవైపు..వైసీపీ లీడర్లు స్టేట్మెంట్లతో హోరెత్తిస్తున్నారు. కల్తీ నెయ్యి ఇష్యూలో చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కార్నర్ చేస్తోంది ఫ్యాన్ పార్టీ. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
స్పెషల్ సిట్ దర్యాప్తులో కల్తీ నెయ్యి ఎపిసోడ్లో అసలు సూత్రధారులను వదిలేశారని, కేవలం నామమాత్రంగా పాత్రధారులను మాత్రమే అరెస్టు చేశారని కూటమి ప్రభుత్వం భావిస్తోందట. అంతేకాకుండా సిట్ విచారణ రిపోర్ట్, ఛార్జిషీట్లలో కూడా తేడాలు ఉన్నాయని అనుమానిస్తున్నారట. దీంతో నిజానిజాలు పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విచారణ కమిషన్ వేయాలని కూటమి సర్కార్ డిసైడ్ చేసింది. దీంతో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఇష్యూపై మరోమారు విచారణ జరిగే అవకాశం ఉంది.
Also Read: ఇండియా-అమెరికా డీల్‌తో ఎన్నెన్ని లాభాలో.. ఇప్పుడు భారత గ్లోబల్ మార్కెట్ పరిధి ఎంతగా విస్తరించిందంటే?
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు సూత్రధారులెవరో తేల్చాలనేదే ప్రభుత్వం టార్గెట్ అంటున్నారు. కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేసిన స్పెషల్ సిట్ తన నివేదికలో పాత్రధారులపై చర్యలకు మాత్రమే సిఫార్సు చేసిందని..క్వాలిటీ లేని నెయ్యిని టీటీడీకి సప్లై చేసేందుకు కారణమైన అసలు సూత్రధారులను సిట్ వదిలేసిందని కూటమి పెద్దలు భావిస్తున్నారట.
ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలు
సిట్ విచారణ, ఛార్జిషీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలు ఉన్నట్లు చెబుతున్నారు. విచారణలో బయటపడిన వాస్తవాలను ఛార్జిషీట్లో ఎందుకు ప్రస్తావించలేదన్న అంశంపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చకు వచ్చిందట. సిట్ విస్మరించిన అంశాలను బయటికి తీసేందుకే విచారణ కమిషన్‌ను వేశామని అంటున్నారు. లిమిటెడ్ టైమ్‌లో రిపోర్ట్ తెప్పించుకుని బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయిందట సర్కార్.
వైసీపీ హయాంలో నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడంతోనే కల్తీ నెయ్యి సరఫరాకు రూట్ క్లియర్ అయిందని..ఆ రూల్స్ మార్చడం వెనుక అప్పటి టీటీడీ పెద్దలు, గత ప్రభుత్వంలోని కీలక నాయకుల హస్తం ఉందనేది కూటమి ప్రభుత్వం అనుమానం. సడలించిన నిబంధనలను తిరస్కరించే అధికారం ఉన్నా, అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కఠిన నిర్ణయం తీసుకోకుండా ఉండిపోయారని భావిస్తున్నారట. అందుకే ఆయనపై బదిలీ వేటు వేశారని అంటున్నారు.
వైసీపీ హయాంలో 2022లో చేయించిన సీఆర్టీఐ నివేదికలోనే నెయ్యి కల్తీ జరిగిందని క్లారిటీ వచ్చినా, చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఎన్నో డౌట్స్..మరెన్నో కన్ఫ్యూజన్స్ కంటిన్యూ అవుతున్న వేళ..కల్తీ నెయ్యిపై విచారణ కమిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. ఏపీలో రాజకీయాల్లో కల్తీ నెయ్యి ఎపిసోడ్ మళ్లీ కాక పుట్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు మార్చారని కూటమి ఆరోపిస్తోంది.
అర్హత లేని భోలేబాబా డెయిరీ నెయ్యి కాంట్రాక్టు దక్కించుకుందని, ఇలా జరగడం వెనుక ఏదో మతలబు ఉందనేది కూటమి పెద్దల ప్రధాన ఆరోపణ. టీటీడీకి గతంలో సహకార డెయిరీల నుంచి నెయ్యి సరఫరా అవుతుండేదని చెబుతున్నారు. వైసీపీ హయాంలో టెండర్ నిబంధనలు మార్చడంతో ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ కాంట్రాక్టును దక్కించుకుందని అంటున్నారు. అయితే ఈ కాంట్రాక్టును తాము ఇవ్వలేదని, 2019కు ముందు చంద్రబాబు సీఎంగా ఉండగానే భోలెబాబా డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టారని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.
ఇప్పటివరకు ఏం జరిగింది?
విచారణ కమిషన్ అంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనతో.. టీటీడీ కల్తీ నెయ్యి ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందోనన్న చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్..కల్తీ నెయ్యి, జంతవుల ఫ్యాట్స్ అంటూ ప్రకటనలు చేశారు. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
సుప్రీం ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ సిట్ దర్యాప్తు జరిపింది. భోలేబాబా డెయిరీ తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి 68 లక్షల కిలోల నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసిందని గుర్తించింది. 35 మందిని అరెస్టు కూడా చేశారు స్పెషల్ సిట్ అధికారులు. అయితే నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడంలో అప్పుడు టీడీపీలో ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా ఉన్న నేతలు..అప్పటి ఈవోలు..అప్పటి ప్రభుత్వ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండొచ్చన్నది కూటమి లీడర్ల ఆరోపణ.
స్పెషల్ సిట్ ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా కేవలం డెయిరీలపైనే ఫోకస్ పెట్టిందని..కానీ అసలు చక్రం తిప్పినవాళ్లెవరో తేల్చలేదంటున్నారు. సిట్ పాత్రధారులను అరెస్టు చేసి సూత్రధారులను వదిలేసిందని..అందుకే వైసీపీ లీడర్లు తామేం తప్పు చేయలేదన్నట్లుగా రెచ్చిపోతున్నారని ప్రభుత్వం అసంతృప్తిగా ఉందట.
ఈ విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య కొన్నిరోజులుగా డైలాగ్‌వార్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పొలిటికల్ హీట్ మరింత పెరిగేలా ప్రభుత్వం విచారణ కమిషన్ వేయడం హాట్ టాపిక్ అవుతోంది. పరిస్థితులను చూస్తే కల్తీ నెయ్యి ఎపిసోడ్ రాబోయే ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జరుగుతోంది.
