ఇండియా-అమెరికా డీల్‌తో ఎన్నెన్ని లాభాలో.. ఇప్పుడు భారత గ్లోబల్ మార్కెట్ పరిధి ఎంతగా విస్తరించిందంటే?
కేంద్ర సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశీయ ప్రయోజనాలపై రాజీ పడకుండానే ఈ ఒప్పందం సాధ్యమయ్యేలా చేసినట్లు తెలుస్తోంది. ఇది భారత వాణిజ్యానికి భారీ ఊరటనిచ్చే అంశం.
India-US Trade Deal
- మన టెక్స్టైల్స్, వస్త్రాలు, కార్పెట్లకు లాభం
- చర్మ ఉత్పత్తులు, ఆభరణాలకు మార్కెట్
- చైనా, బంగ్లాదేశ్, వియత్నాంపై ఆధిక్యం
India US Trade Deal: భారత్, అమెరికా ఈ నెల 2న వాణిజ్య ఒప్పందంపై ప్రకటనలు చేశాయి. దీంతో భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో అవకాశాలు భారీగా పెరిగాయి.
భారత్‌పై 50%గా ఉన్న సుంకాలు (రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై వేసిన 25%తో కలిపి) ఏకంగా 18%కి తగ్గాయి. కేంద్ర సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశీయ ప్రయోజనాలపై రాజీ పడకుండానే ఈ ఒప్పందం సాధ్యమయ్యేలా చేసినట్లు తెలుస్తోంది. ఇది భారత వాణిజ్యానికి భారీ ఊరటనిచ్చే అంశం.
మన టెక్స్టైల్స్, వస్త్రాలు, కార్పెట్లు, చర్మ ఉత్పత్తులు, ఆభరణాలు, ఇంజినీరింగ్ ఎగుమతులు అమెరికా మార్కెట్లో మరింత పోటీనిచ్చే అవకాశం వచ్చింది. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలపై భారత్‌కు ఆధిక్యం లభించింది.
సుంకాల తగ్గింపు ప్రకటన తర్వాత భారత మార్కెట్లు లాభపడ్డాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 119 పైసలు బలపడి 90.3 స్థాయికి చేరింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సూచించింది.
వ్యవసాయం, పాడి, మత్స్యకార రంగాలు, అనుబంధ కార్యకలాపాల వంటి కీలక దేశీయ రంగాలను భారత్ రక్షించింది. రైతుల జీవనోపాధి, ఆహార భద్రతకు భంగం రాకుండా చూసింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశపెట్టే విషయంలో ఒత్తిడి ఉన్నా కేంద్ర సర్కారు రాయితీలు ఇవ్వలేదు.
Also Read: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: మహబూబ్‌నగర్‌లో నితిన్ నబీన్ కామెంట్స్
భారత గ్లోబల్ మార్కెట్ పరిధి ఎంతలా విస్తరించిందంటే?
మరోవైపు, 18 ఏళ్ల చర్చల తర్వాత యూరోపియన్ యూనియన్‌తో చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. అదే సమయంలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌ల్యాండ్, లిచ్టెన్స్టెయిన్ దేశాలకు చెందిన ఈఎఫ్టీఏ (యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్)తో పాటు ఒమన్, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది ఇండియా. సుంకాలు గణనీయంగా తగ్గాయి. భారత గ్లోబల్ మార్కెట్ పరిధి విస్తరించింది.
టెక్స్టైల్స్, స్టీల్, ఔషధాలు, రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులపై ట్రంప్ వల్ల కొన్ని రోజులు 50% సుంకాలు ఎదురైనప్పటికీ, 2025 సెప్టెంబర్ ఎగుమతి గణాంకాల్లో వృద్ధి కనపడింది.
ట్రంప్ అదనపు టారిఫ్‌లు విధించడంతో ఇండియా తన వాణిజ్యాన్ని వైవిధ్యీకరించింది. పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది.
ప్రపంచంలోని పలు దేశాలు అమెరికా ఒత్తిడికి వేగంగా స్పందించిన వేళ భారత్ సహనంతో కూడిన విధానాన్ని అనుసరించింది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. దౌత్య చర్చలను కొనసాగించింది.
భారత ఎగుమతిదారులు వేగంగా మార్కెట్లను వైవిధ్యీకరించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగ్లాదేశ్, బ్రెజిల్, కెన్యా దేశాలకు భారత్ ఎగుమతులను మళ్లించింది. 2030 నాటికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు మించి తీసుకెళ్లే లక్ష్యాన్ని భారత్ పెట్టుకుంది.
