తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: మహబూబ్‌నగర్‌లో నితిన్ నబీన్ కామెంట్స్
ఇవాళ మహబూబ్‌నగర్‌లో ఆయన పర్యటించారు. ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
BJP National President Nitin Nabin
- ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్లో విజయ సంకల్ప సమ్మేళనం
- పాల్గొని మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు
- కాంగ్రెస్ సర్కారుపై విమర్శల జల్లు
Nitin Nabin: కాంగ్రెస్ పాలనలో బలహీన వర్గాలకు ఎటువంటి న్యాయమూ జరగలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లో ఆయన పర్యటించారు. ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎస్టీ, ఎస్సీ సంక్షేమ పథకాల నిధుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోత పెడుతోందని నితిన్ నబీన్ చెప్పారు. కాంగ్రెస్ సర్కారు హామీల అమలులో విఫలమైందని తెలిపారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని అన్నారు. అన్ని వర్గాల వారినీ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు.
“మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. రూ.2,500 ఆర్థిక సాయం చేయలేదు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. మహిళలపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.
రైతులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది. రెండేళ్లుగా ఈ హామీలు అమలు చేయకుండా పాలన చేస్తుంది. రైతు భరోసా, రుణమాఫీ చేస్తామని మోసం చేసింది. కాంగ్రెస్ హయాంలో కూడా కమిషన్ రాజ్, గూండా రాజ్ పోలేదు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు.
మూడు హై స్పీడ్ కారిడార్లను తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అభివృద్ధి కి బీజేపీ కట్టుబడి ఉందని నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది. పసుపు బోర్డు, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, ఇండస్ట్రియల్ కారిడార్‌ను కేటాయించి తెలంగాణ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారు.
మోదీ జీఎస్టీ స్లాబ్‌లను తగ్గించి ప్రజల ఖర్చును తగ్గించారు. యూరోపియన్ యూనియన్‌తో ట్రేడ్ డీల్ చేసి ప్రధాని మోదీ దేశాభివృద్ధికి తన బాధ్యత చాటుకున్నారు.
వక్ఫ్ బోర్డును బలోపేతం చేయాలని కాంగ్రెస్ సర్కారు చూస్తోంది. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా వాటిని ఆపడం లేదు. తెలంగాణలో జరుగుతున్న ఇటువంటి దాడులను సహించబోం.
Also Read: మా పరిశోధనలో ఒక పెద్ద ‘బినామీ స్కామ్’ బయటపడింది: కేటీఆర్ సంచలనం
సనాతన ధర్మం పాటించే వారి మనోభావాలను దెబ్బతీసేలా తెలంగాణ సీఎం మాట్లాడుతున్నారు. తెలుగు ప్రజలకు, సంస్కృతికి నష్టం చేసేలా ముస్లిం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లిం అనే నినాదం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల బడ్జెట్‌ను తగ్గించి మైనారిటీలకు నిదులు పెంచారు. ముస్లిం ఓట్లు కోసం ఎలా తాపత్రయ పడుతున్నారో ప్రజలు చూస్తున్నారు” అని అన్నారు
కాగా, తన పర్యటనలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై కూడా చర్చించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.
