మా పరిశోధనలో ఒక పెద్ద ‘బినామీ స్కామ్’ బయటపడింది: కేటీఆర్ సంచలనం
"కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రా అనేది నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని నేను స్పష్టంగా చెబుతున్నాను. దివాళా తీసిన స్థితిలో ఉన్న ఈ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.6,000 కోట్ల టెండర్లు ఎలా కట్టబెట్టారో చెప్పాలి" అని కేటీఆర్ అన్నారు.
KTR, Revanth Reddy
- సీఎం బినామీ బాగోతాన్ని కప్పిపుచ్చడానికే డ్రామాలు
- KLSR ఇన్ఫ్రా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు అందాయి
KTR: కాంగ్రెస్ సర్కారుపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
తెలంగాణ భవన్లో కేటీఆర్ ఇవాళ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. “రూ.1.5 లక్షల కోట్ల దోపిడీకి తెరలేపిన మూసీ ప్రాజెక్టును మేమే అడ్డుకుని ప్రజలను చైతన్యవంతులను చేశాం. లగచర్లలో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసం గిరిజనుల భూములు లాక్కోవడాన్ని మేం ఎండగట్టి, ఆ స్కామ్‌ను బయటపెట్టాం.
“హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పేరుతో జరిగిన రూ.10 లక్షల కోట్ల భూభాగోతాన్ని మేమే వెలుగులోకి తెచ్చాం. ముఖ్యమంత్రి బావమరిదికి సంబంధించిన అమృత్ పథకం కుంభకోణాన్ని ఆధారాలతో సహా మేం బయటపెట్టాం. సింగరేణి బొగ్గు గనులు మరియు సోలార్ టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న భారీ అవినీతిని మేం బహిర్గతం చేశాం.
జనవరి 22 నుంచి హరీశ్ రావుని మొదలుకుని, నన్ను, సంతోష్, చివరకు మా అధినాయకుడు కేసీఆర్‌ను విచారణకు పిలవడం మాకు అనుమానం కలిగించింది. వరుస విచారణల వెనుక ఉన్న అసలు కారణం ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ గేమ్ అని మాకు అర్థమైంది.
Also Read: పవన్ కల్యాణ్ తెలంగాణ ద్రోహి.. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తే..: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్
ముఖ్యమంత్రి బినామీ భాగోతాన్ని కప్పిపుచ్చడానికే ఈ కవర్ డ్రైవ్‌లు ఆడుతున్నారని మేము గుర్తించాం. మా పరిశోధనలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక పెద్ద ‘బినామీ స్కాం’ బయటపడింది. జనవరి 23న కె.ఎల్.ఎస్.ఆర్ (KLSR) ఇన్ఫ్రా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది.
కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రా అనేది నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని నేను స్పష్టంగా చెబుతున్నాను. దివాళా తీసిన స్థితిలో ఉన్న ఈ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.6,000 కోట్ల టెండర్లు ఎలా కట్టబెట్టారో చెప్పాలి.
ఐఆర్పీ (IRP) ప్రొఫెషనల్ అనుమతి లేకుండానే ఈ భారీ టెండర్లను రేవంత్ రెడ్డి తన బినామీలకు ఇచ్చారు. రేవంత్ రెడ్డి కేవలం ‘బినామీ ముఖ్యమంత్రి’ మాత్రమే కాదు, ఆయనే ఒక ‘బినామీ మాస్టర్’ అని నేను నిరూపిస్తాను. 2018లో రేవంత్ రెడ్డిపై జరిగిన ఐటీ దాడుల్లోనే ఈ కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీకి నిధులు మళ్ళించిన ఆధారాలు దొరికాయి.
ముఖ్యమంత్రి కుటుంబీకుల సంస్థలు సాయి మౌర్య ఎస్టేట్స్, భూపాల్ ఇన్ఫ్రా వంటి కంపెనీలకు కె.ఎల్.ఎస్.ఆర్ నుండే డబ్బులు వెళ్లాయి. రేవంత్ రెడ్డి తిరిగే ల్యాండ్ క్రూజర్ కారు (TS 07 FF 0009) కూడా ఈ కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రా పేరు మీదే రిజిస్టర్ అయి ఉంది.
సుమారు రూ. 2.5 కోట్ల విలువైన కారును బినామీ కంపెనీ ఎందుకు కొనిచ్చిందో చెప్పాలని నేను అడుగుతున్నాను. కె.ఎల్.ఎస్.ఆర్ కేసుకు సంబంధించి తీర్పును ప్రభావితం చేయాలని జడ్జి మీద ఒత్తిడి తేవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి అండ చూసుకునే ఫోన్ మెసేజ్‌లతో ఒత్తిడి తేవడం వల్లనే జస్టిస్ శరత్ కుమార్ విచారణ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఈ కంపెనీ వెబ్సైట్ నుంచే సమాచారం తీసుకోండి, వాళ్లే స్వయంగా మాకు రూ. 6,000 కోట్ల విలువైన అమృత్, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా స్కూల్స్ ప్రాజెక్టులు వచ్చాయని చెప్పుకుంటున్నారు” అని కేటీఆర్ చెప్పారు.
