Honey Trap: మరో కిలాడీ లేడీ.. డేటింగ్ యాప్లో మాయ.. ప్రైవేట్ వీడియోలతో రూ. 6 కోట్లు బ్లాక్మెయిల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో డేటింగ్ యాప్ల ద్వారా పురుషులను బురిడీ(Honey Trap) కొట్టించిన ఓ మహిళ సంచలన ఆరోపణలు ఎదుర్కొంటోంది.
up woman blackmails men on dating app extorts 6 crore with private videos
- డేటింగ్ యాప్లో హనీట్రాప్ మోసం
- ఆరు కోట్ల రూపాయల వసూలు
- కిలాడీ లేడీపై క్రిమినల్ కేసులు
Honey Trap: సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ చాలామంది డేటింగ్ యాప్ల వలలో పడి నిలువునా మునిగిపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో డేటింగ్ యాప్ల ద్వారా పురుషులను బురిడీ కొట్టించిన ఓ మహిళ సంచలన ఆరోపణలు ఎదుర్కొంటోంది. టిండర్, ఇతర సోషల్ మీడియా వేదికగా పరిచయం పెంచుకుని, ఆ తర్వాత వారితో సన్నిహితంగా మెలిగి రూ. 6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై ఓ హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
స్నేహం పేరిట ప్రైవేట్ వీడియోలు, రూ.6 కోట్ల దందా:
ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. పల్లవి సింగ్ రాజ్పుత్ అనే మహిళ ‘స్వీటీ తివారీ’తో సహా వేర్వేరు పేర్లతో సోషల్ మీడియా, టిండర్ (Honey Trap)ఖాతాలను నిర్వహించేది. పురుషులతో పరిచయం పెంచుకుని, వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫొటోలు, వీడియోలు రికార్డు చేసేది. అనంతరం వాటిని బయటపెడతానని లేదా అత్యాచారం, హత్యాయత్నం వంటి తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి కోట్ల రూపాయలు గుంజినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈమె బెదిరింపులు, ఫిర్యాదుల కారణంగా ఐదుగురు వ్యక్తులు జైలుకు కూడా వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం.
కట్టల కొద్దీ కరెన్సీ, ఆయుధాలతో ఫొటోలు:
ఈ కేసుకు సంబంధించి మంచంపై పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల కట్టలు, చేతిలో తుపాకీ లాంటి ఆయుధంతో ఉన్న మహిళ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బ్లాక్మెయిలింగ్ నెట్వర్క్లో పల్లవి సింగ్కు సహాయంగా మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా భాగస్వాములుగా ఉన్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. వైరల్ అవుతున్న ఫొటోల ఆధారాలను, సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్న పోలీసులు.. సమగ్ర విచారణ పూర్తయిన తర్వాతే కేసులోని పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు.
