దుబ్బాక కాంగ్రెస్‌లో కీలక నేతల చెరో దారి.. నేతల తీరు ఎలా ఉందంటే?
అటు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి..ఇటు పన్యాల శ్రవణ్‌రెడ్డి ఇద్దరూ.. దొందూ దొందే అన్నట్లుగా తయారై పార్టీ క్యాడర్‌ను అయోమయంలో పడేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
Cheruku Srinivas Reddy, Panyala Sravan Reddy
- నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తీరుపై చర్చ
- మరో నేత పన్యాల శ్రవణ్‌రెడ్డి రూటే సెపరేటు..
- శ్రీనివాస్, శ్రవణ్ మధ్య నలిగిపోతున్న క్యాడర్!
Dubbaka: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం. దుబ్బాక అంటే ముందుగా గుర్తుకొచ్చేది దివంగత నేత చెరుకు ముత్యంరెడ్డి పేరే. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంత ప్రజలు మరచిపోలేని పేరు. ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన రెండు సార్లు డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. దుబ్బాక నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి ప్రజల మనస్సు చూరగొన్న దివంగత ముత్యంరెడ్డి తనయుడిగా పాలిటిక్స్‌లోకి వచ్చిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తండ్రి లెగసీని ఏ మాత్రం కాపాడుకోలేకపోయారన్న విమర్శ ఉంది.
ఇక మరో నాయకుడు డాక్టర్ పన్యాల శ్రవణ్ రెడ్డి రూటే సెపరేటు అంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఈయన నియోజకవర్గంలో ఉండేది చాలా తక్కువ అంటున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ దాటి కర్నాటక వరకు వెళ్లి రాజకీయాలు చేసే ఈయనకు, పక్కనే ఉన్న దుబ్బాకకు వచ్చి తమను కలుసుకునే తీరిక దొరకదు అంటూ కార్యకర్తలే ఆయనపై సెటైర్లు వేస్తుంటారు.
Also Read: చంద్రబాబు, పవన్ భేటీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్.. ఆ సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీకి వచ్చారా?
ఎలక్షన్ల సమయంలో సీటు కోసం హడావుడి చేస్తుంటాడని, తీరా టికెట్ దగ్గకపోతే నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడరని పార్టీలోని సీనియర్ నాయకులే విమర్శిస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓటు కూడా వేయడానికి నియోజకవర్గానికి రాడని, అలాంటి నాయకుడు ప్రజల్ని ఓటు వేయమని ఎలా అడుగుతాడని హస్తం పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్న పరిస్థితి.
క్యాడర్‌ను అయోమయంలో పడేస్తున్నారా?
అటు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి..ఇటు పన్యాల శ్రవణ్‌రెడ్డి ఇద్దరూ.. దొందూ దొందే అన్నట్లుగా తయారై పార్టీ క్యాడర్‌ను అయోమయంలో పడేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని ఎవరైనా కార్యకర్తలు, నాయకులు కలిస్తే డాక్టర్ శ్రవణ్ వారిని టార్గెట్ చేస్తున్నారట. ఇక డాక్టర్ శ్రవణ్‌ను కలిసినా ఆయన శ్రీనివాస్‌రెడ్డిని టార్గెట్ చేస్తుండటంతో కార్యకర్తలు, నేతలు తలలు పట్టుకుంటున్నారు.
తెలంగాణ వచ్చాక జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. దీంతో దుబ్బాకలో కాంగ్రెస్ ఉనికే ఆగమైందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 141 గ్రామ పంచాయతీలకు గాను బీఆర్ఎస్ 85 స్థానాలను దక్కించుకోగా, కాంగ్రెస్ కేవలం 30తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి తీరేనని తిట్టిపోస్తున్నారు సీనియర్ కార్యకర్తలు. గ్రూపు రాజకీయాలతో పార్టీ ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘోర పరాజయంపై అధిష్టానం ఆగ్రహం?
రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఏంటని పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2014లో మెదక్ పార్లమెంట్ స్థానానికి కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిన డాక్టర్ శ్రవణ్ రెడ్డి, ఆ తర్వాత దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
రెండు సార్లు సీటు దక్కించుకున్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డి డిపాజిట్లు కోల్పోయి మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరు నియోజకవర్గంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేయడం లేదని..ఎన్నికలప్పుడే హడావుడి చేసి తర్వాత చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్లు.
పటిష్టమైన క్యాడర్ ఉన్నా, నాయకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తోందని..చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి తీరులో మార్పు రాకపోతే నియోజకవర్గంలో పార్టీ మరింత బలహీనపడటం ఖాయమని అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దృష్టిపెట్టి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు కార్యకర్తలు. లేకపోతే రానున్న మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో మరిన్ని అపజయాలు మూటకట్టుకోక తప్పకపోవచ్చని కార్యకర్తలు దిగులుపడుతున్నారు.
