Prabhas : బాహుబలి సినిమాతో పాన ఇండియా స్టార్ అయిన ప్రభాస్ అప్పట్నుంచి అన్ని భారీ సినిమాలే చేస్తున్నాడు. పాన్ ఇండియా టార్గెట్ పెట్టుకొని, 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. సినిమా గురించి టాక్ ఎలా ఉన్నా ప్రభాస్ సినిమాలకు కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో కొత్త కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభాస్.
ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ భైరవ పాత్రలో అదరగొట్టాడు. కల్కి సినిమా ప్రేక్షకులని మెప్పించి థియేటర్స్ వద్ద కలెక్షన్స్ సునామి కురిపిస్తుంది. ఇప్పటికే కల్కి సినిమా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే కల్కి సినిమాకు కూడా పార్ట్ 2 అనౌన్స్ చేసారు. దీంతో ప్రభాస్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాలపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రభాస్ చేతిలో ఆల్మోస్ట్ అరడజను సినిమాలు ఉన్నాయి. అన్ని పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
Also Read : Maharaja – Kalki : వంద కోట్ల ‘మహారాజ’.. తమిళ్లో ప్రభాస్ ‘కల్కి’కి పోటీ ఇస్తున్న విజయ్ సేతుపతి..?
ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు ఇవే..
ప్రస్తుతం ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ ఆల్రెడీ సగం అయిపోయిందని సమాచారం. త్వరలో రాజా సాబ్ షూట్ మొదలుపెట్టి రెండు నెలల్లో పూర్తి చేస్తారని తెలుస్తుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల్లో ఈ సినిమానే తక్కువ బడ్జెట్ కావడం గమనార్హం.
రాజా సాబ్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ఆల్రెడీ సెట్ వర్క్ జరుగుతుంది. పాటలు కూడా మూడు పాటలు రెడీ అయినట్టు ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.
ఆ తర్వాత ‘కల్కి 2’ సినిమా షూట్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడు. కల్కి 2 ఆల్రెడీ 60 శాతం షూట్ అయింది. మిగిలిన షూటింగ్ వచ్చే సంవత్సరం చేయనున్నట్టు ఇటీవల నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. కల్కి ఇచ్చిన హైప్ తో కల్కి 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబోలో ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్ చేసారు. అయితే ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. వచ్చే సంవత్సరం షూట్ మొదలుపెడతారని ఇటీవల సందీప్ తెలిపాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తాడని తెలుస్తుంది.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ సినిమాతో ప్రభాస్ కలెక్షన్స్ విషయంలో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాకు కూడా పార్ట్ 2 ఉంది. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దేవర రిలీజ్ అవ్వగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంది. దీంతో ఈ సినిమా అయ్యాకే ‘సలార్ 2’ సినిమా ఉంటుంది.
వీటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా ఉందని గతంలో ప్రకటించారు. ఇలా ఏకంగా ఆరు పాన్ ఇండియా సినిమాలతో అందరి స్టార్ హీరోలని మించి బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఏ స్టార్ హీరో చేతిలో కూడా ఇన్ని సినిమాలు లేకపోవడం గమనార్హం.