DVV Danayya : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, OG సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాలు, ప్రభుత్వ పనులతో బిజీగా ఉండటంతో డేట్స్ ఇద్దామనుకున్నా కుదరట్లేదు. పవన్ బిజీ షెడ్యూల్స్ వల్ల రెండు సినిమాలు ఇప్పటికే అనేకమార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇటీవల హరిహర వీరమల్లు సినిమాకు కుదిరినన్ని డేట్స్ ఇచ్చారు. ఇంకా ఆ సినిమా 7 రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది.
అయితే ఫ్యాన్స్ మాత్రం OG సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే OG సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ పవన్ లేని పోర్షన్స్ కూడా షూటింగ్ అయిపొయింది. పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు మిగిలిన షూట్ చేయడమే. OG సినిమాకు పవన్ కనీసం 20 రోజుల డేట్స్ ఇవ్వాలి. ఇప్పటికే ఈ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడింది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యాకే OG రిలీజవుతుందని మాత్రం క్లారిటీ ఉంది.
తాజాగా OG సినిమా నిర్మాత DVV దానయ్య తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నేడు ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం OG సినిమా ప్రొడక్షన్ జరుగుతుంది. కొంత షూటింగ్ మిగిలి ఉంది. త్వరలోనే విడుదలకు రెడీ కానుంది. త్వరలో OG సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం అని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నా ఆ మిగిలిన షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో, ఈ సంవత్సరమే OG సినిమా రిలీజ్ అవుతుందా అని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.