Natti Kumar : థియేటర్ల సమస్యలకు త్వరలో ముగింపు..! సీఎం జగన్‌పై పూర్తి నమ్మకం ఉందన్న నిర్మాత
ఏపీలో థియేటర్ల సమస్యలపై నిర్మాత నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టికెట్ రేట్లు సహా థియేటర్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన నమ్మకంగా చెప్పారు. సీఎం జగన్ పై
- Naveen
- Published On : December 26, 2021 / 05:40 PM IST
Natti Kumar
Natti Kumar : ఏపీలో థియేటర్ల సమస్యలపై నిర్మాత నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టికెట్ రేట్లు సహా థియేటర్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన నమ్మకంగా చెప్పారు. సీఎం జగన్ పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు నట్టి కుమార్.
”జనవరి 5, 6 తేదీ కల్లా ఏపీలో థియేటర్స్ సమస్యలతో పాటు అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయి. ఇందులో ప్రతి పక్షాలు ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి. సీఎం జగన్ పై పూర్తి నమ్మకం ఉంది. ఏపీ ప్రభుత్వం సిని పరిశ్రమకు అన్ని చేస్తుంది. న్యాయస్థానంపైనా పూర్తి నమ్మకం ఉంది. ఏపీలో ఎక్కడా టికెట్ రేట్లు తగ్గించ లేదు. ప్రజలెవరూ అపోహలు పెట్టుకోవద్దు. కొందరు రేట్లు తగ్గించారని లేని పోని ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్ర. సినీ పరిశ్రమపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు” అని నట్టికుమార్ అన్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తే, తెలంగాణలో రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం జీవో 35 తీసుకొచ్చింది. ఈ జీవో తీవ్ర వివాదానికి దారితీసింది. టికెట్ ధరల తగ్గింపుపై సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. టికెట్ ధరల తగ్గింపును సవాల్ చేస్తూ ఏపీలో పలు థియేటర్ల యజమానులు హైకోర్టుని ఆశ్రయించగా, జీవో నెం.35ను న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వ్యవహారం ఇంకా కోర్టు విచారణలో ఉంది. దీనిపై జనవరి 4న తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీలో థియేటర్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించిన వాటిని సీజ్ చేస్తున్నారు. ఓవైపు టికెట్ రేట్ల తగ్గింపు, మరోవైపు అధికారుల సోదాలు.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు వాటి యజమానులు. ఇంత తక్కువ ధరలతో నడపలేము అని థియేటర్లకు తాళాలు వేస్తున్నారు. టికెట్ ధరల దెబ్బకు ఆసియాలోనే అతిపెద్ద స్ర్కీన్ కలిగిన థియేటర్ గా గుర్తింపు పొందిన నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలోని వీ-ఎపిక్ సినిమా కూడా మూతపడింది. ఈ మల్టీప్లెక్స్ ను బాహుబలి థియేటర్ అని కూడా పిలుస్తారు.
