Deep Sidhu : ప్రముఖ నటుడు, ఎర్రకోట అల్లర్లలో నిందితుడు మృతి

ప్రముఖ పంజాబీ నటుడు, సామాజిక ఉద్యమకారుడు, ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ మృతి చెందాడు. హర్యానాలోని సోనిపట్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధూ మరణించాడు.

Deep Sidhu

Deep Sidhu : ప్రముఖ పంజాబీ నటుడు, సామాజిక ఉద్యమకారుడు, ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ మృతి చెందాడు. హర్యానాలోని సోనిపట్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధూ మరణించాడు. ఢిల్లీ నుంచి భటిండా వైపు వెళ్తుండగా రాత్రి 9.30గంటల ప్రాంతంలో సోనిపట్‌ దగ్గర సిద్ధూ కారు ఓ స్టేషనరీ ట్రక్‌ను ఢీకొట్టింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలో దీప్ సిద్ధూ పేరు ప్రధానంగా వినిపించింది. పార్లమెంటు ముట్టడిలో భాగంగా ఎర్రకోటపై సిక్కుల జెండా ఎగురవేయడం అప్పట్లో సంచలనం రేపింది.

కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో దీప్‌ సిద్ధూ పాల్గొన్నాడు. 2021లో రైతులు చేపట్టిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ సందర్భంగా ఎర్రకోట దగ్గర చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో కీలక నిందితుడిగా సిద్ధూ ఉన్న విషయం తెలిసిందే. రైతుల ట్రాక్టర్ ర్యాలీతో సిద్ధూ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. కొందరు ఆందోళనకారులను రెచ్చగొట్టి ఎర్రకోట వైపు మళ్లించారనే ఆరోపణలు సిద్ధూపై ఉన్నాయి. రైతు ఉద్యమం దారి తప్పటానికి అతడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధూ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు.

దీప్ సిద్దూ 1984లో పంజాబ్‌లోని ముక్త్ సర్‌లో జన్మించాడు. లా చేసిన సిద్ధూ మోడ‌లింగ్ వైపు దృష్టి సారించాడు. మోడల్ గా పని చేశాడు. అనంత‌రం న్యాయాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మోడ‌లింగ్‌, న్యాయ‌వాద వృత్తి తర్వాత సిద్ధూ న‌ట‌న‌వైపు అడుగులు వేశాడు. బాలాజీ టెలిఫిల్మ్స్‌కు లీగల్ హెడ్‌గా పనిచేసే క్ర‌మంలోనే ఏక్తా క‌పూర్ స‌ల‌హాతో న‌ట‌నలోకి అడుగు పెట్టాడు. 2015లో రామ్తా జోగి అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. పలు పంజాబీ చిత్రాల్లో నటించాడు. న‌ట‌న‌లో రాణిస్తూనే రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టాడు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన దీప్ సిద్ధూ.. గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కోసం ప్రచారం చేశాడు. పంజాబ్‌లో దీప్‌ సిద్ధూకి భారీగా అభిమానులు ఉన్నారు.