Carmeni Selvam : ‘కార్మేని సెల్వం’ మూవీ రివ్యూ.. అప్పులు చేసే మధ్యతరగతి వాళ్ళు చూడాల్సిన సినిమా..
మధ్యతరగతి వాళ్ళు, ఆడంబరాలు కోసం అప్పులు చేసేవాళ్లకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. (Carmeni Selvam)
- Saketh U
- Published On : April 3, 2026 / 08:12 AM IST
Carmeni Selvam
Carmeni Selvam : పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో రామ్ చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కార్మేని సెల్వం’. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ,లక్ష్మి ప్రియా చంద్రమౌళి.. కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. కార్మేని సెల్వం సినిమా ఏప్రిల్ 3న తమిళ్, తెలుగులో రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
సెల్వం(సముద్రఖని) ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. సంపత్(గౌతమ్ వాసుదేవ్ మీనన్) దగ్గర డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. సెల్వం భార్య శాంతి( లక్ష్మీప్రియ చంద్రమౌళి) ఓ ఇడ్లి కొట్టు నడుపుతూ ఉంటుంది. శాంతికి సొంత ఇల్లు, తన భర్తకి సొంత కారు ఉండాలి, చుట్టాల ముందు పరువు పోకూడదు, బాగా డబ్బులు సంపాదించాలి అంటూ భర్తతో ఎప్పుడూ పోరు పెడుతుంది. ఓ సంఘటనతో సెల్వం తన చుట్టాల దగ్గరే అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో సంపత్ విదేశాలకు వెళ్లడంతో ఆయన కారుని క్యాబ్ గా మార్చి తిప్పుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు సెల్వం.
తన బండిలో ఎక్కే రకరకాల మనుషుల మాటలు విని అప్పులు చేయడం, డబ్బులు ఖర్చు పెట్టడం, క్రెడిట్ కార్డు తీసుకోవడం.. లాంటివి చేసి అప్పుల్లో మునిగిపోవడమే కాక చివరకు కారుకి కూడా యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అవుతుంది. సెల్వం తన అప్పులు ఎలా తీరుస్తాడు? తన సెంటిమెంట్ కారుని క్యాబ్ గా తిప్పినందుకు సంపత్ కి తెలిసి ఏం చేస్తాడు? శాంతి, సెల్వం డబ్బుల విషయంలో తమ అభిప్రాయాలు మార్చుకుంటారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Biker : ‘బైకర్’ మూవీ రివ్యూ.. బైక్ రేసింగ్ అదిరిందిగా..
సినిమా విశ్లేషణ..
ట్రైలర్ తోనే ఇది స్లోగా ఎమోషన్స్ మీద నడిచే సినిమా అని అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ సెల్వం, సంపత్ వాళ్ళ ఫ్యామిలీలను, వారి మధ్య ఉన్న బంధాలను చూపించడం, సెల్వం డబ్బుల కోసం ఓనర్ కార్ ని క్యాబ్ గా మార్చి ఏం చేసాడు అని సింపుల్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా సెల్వం అప్పుల్లో ఎలా మునిగాడు, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అని ఎమోషనల్ గా సాగుతుంది.
ఈ సినిమా చూస్తున్నంతసేపు మధ్యతరగతి జీవితాలే గుర్తొస్తాయి. సమాజంలో ఎవరెవర్నో చూసి వాళ్ళలా బతకాలి, ఎవరో ఏదో అనుకుంటారు అని గొప్పలకు పోవడం, చుట్టాల దగ్గర పరువు పోతుందేమో అని భయపడి డబ్బులు ఖర్చుపెట్టడం.. లాంటి మాములు మధ్యతరగతి మనుషుల ఆలోచనలతో సినిమాని నడిపించారు. ఇలాంటివన్నీ చేసి అప్పులపాలయి తిప్పలు పడతారు అని చూపించారు.
సినిమాలో సెల్వం చేసే కొన్ని పనులు కామెడీ కూడా తెప్పిస్తాయి. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది. ఫ్యామిలీ, అప్పులు అనే ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. కాకపోతే సినిమాని బాగా సాగదీశారు అనిపిస్తుంది. చాలా సీన్స్ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. ఇక సంపత్ భార్య చనిపోయే సీన్ కథకి సంబంధం లేకపోయినా పెట్టినట్టు అనిపిస్తుంది. షార్జాలో సీన్స్ కూడా సింపుల్ గా అనిపిస్తాయి. అక్కడ ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. డబ్బుల కోసం విదేశాలకు పనులకు వెళ్లే సీన్స్ ని, అందులో ఎమోషన్ తో ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసారు. మధ్యతరగతి వాళ్ళు, ఆడంబరాలు కోసం అప్పులు చేసేవాళ్లకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
సముద్రఖని మధ్యతరగతి వ్యక్తిగా డ్రైవర్ పాత్రలో అదరగొట్టాడు అని చెప్పొచ్చు. తన నటనతో మెప్పిస్తారు. ఆయన భార్య పాత్రలో లక్ష్మీప్రియ చంద్రమౌళి చాలా సహజంగా నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ కాసేపే కనిపించినా సింపుల్ గా మెప్పించారు. సెల్వం కొడుకు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా క్యూట్ గా మెప్పించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Sravanthi chokkarapu: హనుమాన్ జయంతి పూజలో స్రవంతి.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన యాంకర్
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాటలు మాత్రం యావరేజ్. ఎడిటింగ్ విషయంలో కొన్ని ల్యాగ్ సీన్స్ ని కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయి అని కళ్ళకు కట్టినట్టు సింపుల్ కథతో సన్నివేశాలు రాసుకొని బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘కార్మేని సెల్వం’ సినిమా మధ్యతరగతి జీవితాలకు అద్దంపడుతోంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
