Satluj : మూడు పేర్లు.. నాలుగేళ్ల వివాదం.. విడుదలైన 48 గంటల్లోనే ఓటీటీ నుంచి మాయం.. ‘సత్లుజ్’ సినిమా వెనుక అసలు కథ ఇదే!

అసలు ఈ సత్లుజ్ సినిమా కథేంటి అని చర్చగా మారింది. (Satluj)

  • Published on- July 6, 2026 / 02:38 PM IST

Satluj

Satluj : కొన్ని సినిమాలకు అనేక ఇబ్బందులు వస్తాయి. సినిమా రిలీజ్ కి ఎన్నో అడ్డంకులు వస్తాయి. పేరు మారడం, సెన్సార్ వివాదాలు, కోర్టు వివాదాలు. చివరకు ఓటీటీ వివాదం, ఆర్ధిక సమస్యలు.. ఇలా అనేక రకాల అడ్డంకులు సినిమాలకు వస్తుంటాయి. కానీ ఇలాంటి అన్ని సమస్యలు చూసి ఓటీటీలో రిలీజయిన రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్ ఆపేయడంతో ఈ సినిమా ఇప్పుడు సంచలనంగా మారింది. పంజాబీ నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజే మెయిన్ లీడ్ లో నటించిన ‘సత్లుజ్’ సినిమా ఎన్నో ఏళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చి సడెన్ గా ఇటీవల జూలై 3న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ సినిమాని తీసేసారు. దీంతో అసలు ఈ సత్లుజ్ సినిమా కథేంటి అని చర్చగా మారింది.

సత్లుజ్ సినిమా పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కింది. 1990లలో పంజాబ్‌లో అదృశ్యమైన పలువురు వ్యక్తుల కేసులపై ఆయన పరిశోధనలు చేసి కీలక ఆధారాలను బయటకు తీశారు. ఆ క్రమంలో ఆయన 1995లో హత్యకు గురయ్యారు. ఈ వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకొని దర్శకుడు హనీ ట్రెహన్ ఈ సినిమాని తెరకెక్కించారు. మొదట ఈ సినిమాకు ‘ఘల్లుఘరా’ అనే పేరుని ప్రకటించారు. ఆ తర్వాత ‘పంజాబ్ 95’ గా మార్చారు. ఇప్పుడు ఓటీటీలో ‘సత్లుజ్’ అనే పేరుతో రిలీజ్ చేసారు.

Also Read : Divyabharathi : బాబోయ్.. షర్ట్ బటన్స్ తీసేసి.. బోల్డ్ లుక్స్‌లో దివ్యభారతి..

ఈ సినిమా 2022లోనే పూర్తయింది. కానీ రిలీజ్ కి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాని నాలుగేళ్లుగా ఆపుతునే ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మొదట కొన్ని హింసాత్మక దృశ్యాలు, సంభాషణలు, టైటిల్‌పై అభ్యంతరం చెప్తూ 21 మార్పులు సూచించింది. మూవీ యూనిట్ ఆ మార్పులు చేసి మళ్లీ సెన్సార్ కి వెళ్లగా ఈ సారి ఏకంగా 127 కట్స్ సూచించినట్లు సమాచారం. అన్ని మార్పులు చేస్తే అసలు సినిమానే ఉండదు అని నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.

దీంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో థియేటర్లలో విడుదలకు ఇబ్బందులు వస్తుండటంతో ఎలాంటి ప్రచారం లేకుండా జూలై 3న జీ5 ఓటీటీలో ‘సత్లుజ్’ పేరుతో సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సందర్భంగా హీరో దిల్జిత్ దొసాంజే.. ఓటీటీలో విడుదలైనది ఎలాంటి కట్స్ లేని ఒరిజినల్ వెర్షనేనని, సినిమా కత్తిరించి విడుదల చేసి ఉంటే తాను ప్రచారం కూడా చేసేవాడిని కాదని అన్నారు.

Also See : Tejaswini Vygha : పట్టుచీరలో.. భారీ నగలతో..దిల్ రాజు భార్య ట్రెడిషినల్ లుక్స్.. తేజస్విని ఫొటోలు..

అయితే ఏమైందో తెలిదు కానీ సినిమా ఓటీటీలో విడుదలైన రెండు రోజుల్లోనే భారతదేశంలో జీ5 నుంచి తొలగించారు. దీనిపై స్పందించిన సంస్థ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, భారత ప్రేక్షకులకు మళ్లీ అందుబాటులోకి తీసుకురావడానికి చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించింది కానీ అసలు కారణం చెప్పలేదు. అయితే ఇండియాలో తీసేసినా అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కొనసాగుతోంది. మళ్ళీ ఇండియాలో ఎప్పుడు స్ట్రీమింగ్ వస్తుందో క్లారిటీ లేదు.