Shalini Kondepudi Deviyani Sharma #Life Stories Movie Review and Rating
#Life Stories Movie Review : ఆంథాలజీ జానర్ లో ఆరు కథలతో తెరకెక్కిన ‘#లైఫ్ స్టోరీస్’ సినిమా నేడు సెప్టెంబర్ 14న థియేటర్స్ లో రిలీజయింది. అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్స్ పై MM విజయ జ్యోతి నిర్మాణంలో ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ, వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. ఇది ఒక ఆంథాలజీ జానర్ సినిమా. ఆరు వేరు వేరు కథలను చూపించి చివరికి వాటన్నిటిని ఒకే కథలోకి తీసుకొచ్చారు. ఆరు కథలకు ఆరు పేర్లు ఇచ్చి చూపించారు. మొదటి కథ ‘క్యాబ్ క్రానికల్స్’ లో.. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్యాబ్‌లో వెళ్తుండగా, ఆ క్యాబ్‌లో మినీ లైబ్రరీ మెయింటైన్ చేయడం చూసి డ్రైవర్ తో, ఆ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ కి మధ్య మధ్య సంభాషణ ఏంటి అని సాగుతుంది. రెండో కథ వైల్డ్ హట్స్‌లో.. ఉద్యోగ రీత్యా భార్య భర్తలు దూరం దూరంగా వేరే ఊళ్ళల్లో ఉంటారు. న్యూ ఇయర్ రోజు కలుద్దామని ప్లాన్ వేసుకుంటే భార్య(షాలిని కొండేపూడి)కి ఫుల్ వర్క్ ఇస్తారు. మరి భార్య భర్తలు కలిసారా అని సాగుతుంది. మూడో కథ బంగారం.. ఊరి అవతల ఉన్న రోడ్డుకు అనుకోని మంగమ్మ అనే ఓ పెద్దావిడ చిన్న టీ కొట్టు నడుపుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆమె టీ కొట్టు దగ్గర మంచి కుక్కని కార్లో తీసుకొచ్చి వదిలేసి వెళ్తారు. ఆ కుక్క మంగమ్మకు ఎలా దగ్గరయింది, కుక్క రాకతో మంగమ్మ జీవితం ఎలా మారింది అని సాగుతుంది.
నాలుగో కథ మామ్ మీ.. సింగిల్ మదర్(దేవియని శర్మ) తన జాబ్ లైఫ్ లో పడి తన కొడుకుని పట్టించుకోదు. ఇంట్లో పనిమనిషే అన్ని చూసి ఆ పిల్లాడ్ని స్కూల్ కి పంపిస్తుంది. దీంతో ఆ పిల్లాడు బాధపడతాడు. మరి ఆ సింగిల్ మదర్ పిల్లాడ్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, పిల్లాడి లైఫ్ లోకి సంతోషం ఎలా వచ్చింది అని సాగుతుంది. ఐదో కథ గ్లాస్ మేట్స్.. ఓ సీనియర్ కపుల్ న్యూ ఇయర్ పార్టీ చేసుకోడానికి ఒక రిసార్ట్ కి వెళ్తే అందులో భర్తకి కాలేజీ ఫ్రెండ్ కనపడటం, ఆ ఫ్రెండ్ భార్యతో ఇతని భార్య క్లోజ్ అవ్వడంతో సాగుతుంది. ఇక ఆరో కథ జిందగీ.. ఓ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ న్యూ ఇయర్ రోజు తన లవర్ తో ప్లాన్ వేస్తే లవర్ హ్యాండ్ ఇవ్వడంతో ఏం చేసాడు అని సాగుతుంది. ఆరు కథలని విడివిడిగా చూపించి చివరకు వీటిని ఎలా కలిపారు అనేది తెరపై చూడాల్సిందే.
Also Read : Megha Akash : పెళ్లి పనులు మొదలుపెట్టిన హీరోయిన్.. ఘనంగా మెహందీ వేడుక..
సినిమా విశ్లేషణ.. సాధారణంగా ఆంథాలజీ సినిమాలు కథల్ని చెప్పేటప్పుడు కొంచెం బోరింగ్ గా అనిపించినా ఆ కథల్ని చివర్లో కలిపేటప్పుడు ఆసక్తి నెలకొంటుంది. ఈ #లైఫ్ స్టోరీస్ సినిమాలో ఆరు కథలను చూపించారు. వీటిల్లో మంగమ్మ కథ, మామ్ మీ కథ ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. అయితే ఈ కథలన్నీ కొంచెం స్లో నేరేషన్ తో సాగుతాయి. ఫస్ట్ హాఫ్ లో మూడు కథలు, సెకండ్ హాఫ్ లో మూడు కథలు చూపిస్తారు. అయితే ఈ ఆరు కథలను చివర్లో ఎలా కలిపారు అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ కథలని కలపడం, కథల్లోని మనుషులని కలపడం క్లైమాక్స్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. న్యూ ఇయర్ చుట్టూ ఈ కథలన్నీ తిరుగుతాయి.
ఆంథాలజీ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఈ సినిమా నచ్చొచ్చు. అయితే విజువల్ పరంగా చూస్తే ఇది ఒక ఇండిపెండెంట్ ఫిలింలా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో చాలా పాత్రలు హిందీ, ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటాయి. కథ పరంగా అవసరం లేకపోయినా కొన్ని పాత్రలు తప్ప మిగిలిన అందరూ హిందీ లేదా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తో తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కష్టమే.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సింగిల్ మదర్ పాత్రలో దేవియని శర్మ మెప్పించింది. సీనియర్ కపుల్ భర్త పాత్రలో ప్రదీప్ రాపర్తి అదరగొట్టారు. సత్య కేతినీడి, రాజశేఖర్, రాజు గొల్లపల్లి, మోహన్ రావు, సంతోష్, షాలిని కొండేపూడి, గౌతమ్.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకొంచెం బెటర్ గా ఉండాలి అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా పర్వాలేదనిపించాయి. ఒక ఆరు కథలను ఆంథాలజీ స్క్రీన్ ప్లేలో చక్కగా రాసుకొని చూపించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా #లైఫ్ స్టోరీస్ ఆరు విభిన్న కథలు, వాటిని చివర్లో ఎలా కలిపారు అని ఆంథాలజీ జానర్లో ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.