కరోనా ఎఫెక్ట్ : క్షేమంగా ఢిల్లీ చేరుకున్న సోనమ్ దంపతులు.. బాంద్రాలో జిమ్ తెరిపించిన షాహిద్ కపూర్..
కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి చెందకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ.. విదేశాల నుంచి రాకపోకలను నిలిపి వేసింది. ఈ పరిస్థితిలో సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా దంపతులు లండన్ నుండి ఇండియాకు తిరిగొచ్చారు. లండన్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు భారత ప్రభుత్వం మరియు అధికారులు తీసుకుంటున్న భద్రత చర్యలపై సోనమ్ ప్రశంసలు కురిపించింది. తాను ఎయిర్‌పోర్టులో గమనించిన కొన్ని విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిందామె.
‘ఆనంద్, నేను ఢిల్లీకి వచ్చాం. ఎయిర్‌పోర్టులో ఉన్నవారికి థ్యాంక్స్ చెప్పాలి. మేం లండన్‌లో ఉన్నపుడు ఎక్కడా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించలేదు. కానీ ఢిల్లీలో స్క్రీనింగ్ టెస్ట్‌లను చూసి ఆశ్చర్యపోయాం. భారత్‌కు రాగానే అధికారులు మమ్మల్ని ఓ ఫార్మ్ నింపాలని చెప్పగా.. గత 25 రోజుల నుంచి చేసిన ప్రయాణ వివరాలను రాసిచ్చాం.
కరోనాను ఎదుర్కొనేందుకు మన అధికారులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం’ అంటూ పోస్ట్ చేసింది. అదృష్ఠవశాత్తు మేం కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లలేదు. నాకు, ఆనంద్‌కు కరోనా లక్షణాలేమి లేవు. మేం మా తల్లిదండ్రులు, నానమ్మతో కలిసి జీవిస్తాం. మాకు మేం స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. యువత, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని’ కోరింది సోనమ్.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని విద్యాసంస్థలు, కమ్యూనిటీ హాళ్లు, థియేటర్లు, జిమ్‌లను మూసివేయించింది. అయితే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. బాంద్రాలోని యాంటీ గ్రావిట్ క్లబ్‌లోని జిమ్‌ను తెరిపించి, రెండు గంటలపాటు అందులో గడిపారు. ఈ సమయంలో ఆయన భార్య మీరా కూడా ఉన్నారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం జిమ్‌ను పూర్తిస్థాయిలో మూసేసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు షాహిద్ కపూర్ దానిని తెరిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారం మీడియాకు తెలిసిన నేపధ్యంలో ఆ హీరో భార్యతో సహా జిమ్ బ్యాక్ డోర్ నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జిమ్ యజమాని జయసింగ్ మాట్లాడుతూ : షాహిద్ కపూర్ తనకు స్నేహితుడని, అతను ఇక్కడికి వర్క్ అవుట్ చేయడానికి రాలేదని, తనతో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు మాత్రమే వచ్చారన్నారు.