Om Bheem Bush : ‘ఓం భీమ్ బుష్’ రివ్యూ.. సెకండ్ హాఫ్ ఎవరూ ఊహించలేరు.. నవ్వించి.. భయపెట్టి..

ఓం భీమ్ బుష్ సినిమా ప్రేక్షకులని నవ్విస్తూనే కాసేపు భయపెట్టి ఓ మంచి పాయింట్ ని ఎమోషనల్ గా చూపించారు.

Sree Vishnu Rahul Ramakrishna Priyadarshi Om Bheem Bush Movie Review

Om Bheem Bush Review : శ్రీవిష్ణు(Sree Vishnu), ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ ‘బ్రోచేవారెవరురా’ లాంటి హిట్ సినిమా తర్వాత ఇపుడు ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ‘హుషారు’ మూవీ ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఓం భీమ్ బుష్ సినిమా నేడు మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ ఫిమేల్ లీడ్స్ లో నటించగా ప్రియా వడ్లమాని ఓ స్పెషల్ సాంగ్ లో అలరించింది.

కథ విషయానికొస్తే.. క్రిష్(శ్రీవిష్ణు), వినయ్(ప్రియదర్శి), మాధవ్(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఇచ్చే స్టైపెండ్ కోసం, ఫ్రీ హాస్టల్ కోసం PHD పేరుతో ఓ యూనివర్సిటీలో చేరి రచ్చ రచ్చ చేస్తుంటారు. దీంతో వీళ్ళ హెడ్(శ్రీకాంత్ అయ్యంగార్) వీళ్ళని ఎలాగైనా పంపించేయాలని వీళ్ళ రీసెర్చ్ పూర్తిచేసి కాలేజీ నుంచి బయటకి పంపించేస్తాడు. అలా బయటకి వచ్చిన ఈ ముగ్గురు భైరవపురం అనే ఊర్లోకి వస్తారు. అక్కడ కొంతమంది అఘోరాలు లంకెబిందెలు వెతకడం, దయ్యాలు వదిలించడం లాంటి పనులు చేసి డబ్బులు సంపాదించడం చూసి వాళ్ళ లాగా ఇక్కడే సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోతారు. దీంతో కాలేజీలో వీళ్ళ బ్యాచ్ కి ఉన్న బ్యాంగ్ బ్రోస్ అనే పేరుతో A టు z సొల్యూషన్స్ అని పెట్టి ఆ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా తీరుస్తూ ఉంటారు.

ఆ ఊరి చివర సంపంగి మహల్ ఉంటుంది. అందులో సంపంగి దయ్యం ఉంది అని ఆ ఊరంతా భయపడుతుంటారు. ఈ బ్యాంగ్ బ్రోస్ వల్ల తమ సంపాదన పోయిందని, వీళ్ళు ఫేక్ అని అఘోరాలు పంచాయితీ పెట్టిస్తారు. ఊళ్ళో వాళ్లంతా బ్యాంగ్ బ్రోస్ కే సపోర్ట్ చేస్తారు. అయితే వీళ్ళు నిజంగా నిధులు వెతుకుతారు, దయ్యాల్ని తీస్తారు అంటే సంపంగి మహల్ లో ఉన్న సంపంగి దయ్యాన్ని పంపించి అక్కడ ఉన్న నిధి తీసుకురావాలని ఛాలెంజ్ విసరడంతో ఊళ్ళో వాళ్ళు భయపడినా ఈ ముగ్గురూ ఓకే అంటారు. మరి సంపంగి మహల్ కి వెళ్లిన ఈ ముగ్గురు బ్యాంగ్ బ్రోస్ ఏం చేసారు? అక్కడ దయ్యాన్ని వీళ్ళు ఎలా డీల్ చేసారు? అసలు ఆ దయ్యం కథేంటి? దయ్యం ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? వీళ్లకు నిధి దొరికిందా? ఈ మధ్యలో క్రిష్, వినయ్ ప్రేమకథలు ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్‌ ‘మైనపు విగ్రహం’ ఓపెనింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది.. ఎప్పుడంటే..

సినిమా విశ్లేషణ.. మొదట్నుంచి కూడా ఓం భీమ్ బుష్ సినిమాని నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అనే ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాలో లాజిక్ వెతకొద్దు చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పారు. మూవీ టీం చెప్పినట్టే ఈ సినిమాలో చాలా వరకు లాజిక్స్ ఉండవు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో, బ్యాంగ్ బ్రోస్ చేసే పిచ్చి పనులతో, ప్రజల సమస్యలను వీళ్ళ పిచ్చి సైన్స్ ఎక్స్‌పరిమెంట్స్ తో తీర్చేయడంతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ బాగా ట్రై చేసారు కానీ చాలా సీన్స్ లో అది వర్కౌట్ అవ్వలేదు. లాజిక్ ఆలోచించొద్దు అన్నారు కాబట్టి సీన్స్ ని చూసి ఎంజాయ్ చేయాలి తప్ప వాటి గురించి ప్రశ్నించకూడదు.

కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. కామెడీ ఎంటర్టైనర్ అని ఈ సినిమాకి వెళ్తే సెకండ్ హాఫ్ లో ఓ అరగంట పాటు హారర్ సినిమా చూపించి భయపెడతారు. దీంతో ఆడియన్స్ కచ్చితంగా షాక్ అవుతారు. సెకండ్ హాఫ్ కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఇక దయ్యం కథ చాలా కొత్తగా ఉంటుంది. దయ్యం ఇచ్చే ట్విస్ట్ ఎవరూ ఊహించారు. దయ్యం కథ, క్లైమాక్స్ ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తాయి. ఫస్ట్ హాఫ్ బోర్ ఫీల్ అయినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఆసక్తిగా ఉంటుంది. డైలాగ్స్ మాత్రం బాగా రాసుకున్నారు. అయితే కొన్ని డైలాగ్స్, ఓ సాంగ్ కొంచెం బోల్డ్ గానే ఉంటాయి. కొన్ని సీన్స్ లో ఆ సీన్ కి కౌంటర్ గా బ్యాక్ గ్రౌండ్ వచ్చే పాత సాంగ్స్ నవ్విస్తాయి. కామెడీ ఎంటర్టైనర్ అని ప్రమోట్ చేసి హారర్, ఎమోషనల్ కంటెంట్ చూపించి ప్రేక్షకులని థ్రిల్ చేసారు.

నటీనటుల విషయానికొస్తే.. శ్రీవిష్ణు కామెడీ జానర్ బాగా చేస్తాడని తెలిసిందే. శ్రీవిష్ణుకి రాహుల్, ప్రియదర్శి లాంటి మంచి కమెడియన్స్, నటులు తోడయితే ఆ కాంబో ఎలా ఉంటుందో బ్రోచేవారెవరురాలోనే అదరగొట్టారు. ఈ సినిమాలో కూడా ముగ్గురు కలిసి తమ నటనతో మెప్పిస్తారు. మెయిన్ లీడ్ ప్రీతీ ముకుందన్ అక్కడక్కడా కనిపించి పర్లేదనిపిస్తుంది. ఇంకో హీరోయిన్ అయేషా ఖాన్ మాత్రం తన అందాలతో అలరిస్తుంది. స్పెషల్ సాంగ్ లో ప్రియా వడ్లమాని కూడా తన అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. దయ్యం పాత్రలో నటించిన వాళ్ళు కూడా తమ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, సునయన.. మిగిలిన నటీనటులు ఓకే అనిపిస్తారు.

Also Read : Matka : అతడి జీవిత ఆధారంగా వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ.. అదే కథతో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ప్రకటన..

సాంకేతిక విషయాలు.. ఈ సినిమాకి మెయిన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. VFX వర్క్స్ కూడా కామెడీ జానర్ కి తగ్గట్టు బాగా చేశారు. అయితే సంగీతం మాత్రం యావరేజ్. సాంగ్స్ అంతగా కనెక్ట్ అవ్వవు. బ్యాక్ గ్రౌండ్ RR చాలా చోట్ల డైలాగ్స్ వినపడకుండా డామినేట్ చేసింది. ఫైనల్ మిక్సింగ్ అప్పుడు ఇంకోసారి చూసుకోవాల్సింది. కానీ హారర్ ఎఫెక్ట్స్ దగ్గర మాత్రం బ్యాక్ గ్రౌండ్ బాగా ఇచ్చారు. కాస్ట్యూమ్స్ కూడా ఈ ముగ్గురికి చాలా కొత్తగా ట్రై చేసారు. యూవీ క్రియేషన్స్ కాబట్టి నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు.

మొత్తంగా ఓం భీమ్ బుష్ సినిమా ప్రేక్షకులని నవ్విస్తూనే కాసేపు భయపెట్టి ఓ మంచి పాయింట్ ని ఎమోషనల్ గా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు