Sri Tridandi Chinna Jeeyar Swamy: ఆలయ పునర్నిర్మాణ డిజిటల్ డాక్యుమెంటరీ సీడీ ఆవిష్కరణ..

తురిమెళ్ల గ్రామంలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ డిజిటల్ డాక్యుమెంటరీ CD విడుదల కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, భక్తులు మైహోమ్ రామేశ్వర్ రావు పాల్గొన్నారు..

Sri Tridandi Chinna Jeeyar Swamy: పురాతన ఆలయాలు పునర్నిర్మించి జీర్ణోద్ధరణ చేయడం మహా పుణ్యమని, భగవంతుడికి అత్యంత ఇష్టమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహంచిన శ్రీ పి.ఎస్.ఆర్.టి స్వామి బృందాన్ని అభినందించారు శ్రీమాన్ త్రిదండి చినజీయర్ స్వామి.. తురిమెళ్ల గ్రామంలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ డిజిటల్ డాక్యుమెంటరీ CD విడుదల కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, భక్తులు మైహోమ్ రామేశ్వర్ రావు పాల్గొన్నారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు కొన్ని శిథిలావస్థలో చేరుకొని వుంటే ఆ స్థలంలోనే ఆలయాన్ని, ధ్వజ స్తంభాన్ని, విమాన శిఖర గోపురాలను నిర్మించి, పూర్వపు విగ్రహాల స్థానంలోనే పూర్వపు ముల విరాట్‌లను ప్రతిష్టించడం ఒక గొప్ప పుణ్యకార్యం అని శ్రీమాన్ చినజీయర్ స్వామి అన్నారు. ప్రముఖ చలన చిత్ర దర్శకులు లక్ష్మణ్ మురారి ఇలాంటి అన్ని విషయాలను పొందు పరుస్తూ ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీను రూపొందించారు. ప్రకాశం జిల్లా, కంభం మండలంలోని తురిమెళ్ల గ్రామంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో తురిమెల్ల గ్రామ పెద్దలు శ్రీ P.S.R.T స్వామి మరియు గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ చినజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయాన్ని పునర్నిర్మించారు.

ఇలా జీర్ణోద్ధరణ కావించబడిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పున:ప్రారంభ కార్యక్రమాలు ప్రత్యేక మైన పూజలతో ఆడంబరంగా ఎంతో నియమ నిష్ఠలతో తురిమెళ్ళ గ్రామ ప్రజలు గతంలో నిర్వహించారు. ప్రారంభానికి ముందు 6 రోజుల కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బంధువులు కలిసి ప్రతి రోజూ అనేకానేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రారంభ కార్యక్రమాలనుండి 41 రోజుల మండల పూజ కార్యక్రమాల వరకు జరిగిన ఇత్యాది పూజా కార్యక్రమాలను, అత్యాధునిక 6 కెమెరాలు, fly cam కెమెరాలతో షూట్ చేసి ఒక అద్భుతమైన డాక్యుమెంటరీని రూపొందించారు చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మురారి. ఈ డాక్యుమెంటరీ ఆల్బమ్‌ను చూసిన ప్రముఖులు ఈ డాక్యుమెంటరీలో పూజలు, నియమాలు పొందు పరిచిన తీరు చాలా వైవిధ్యంగా, వైదిక కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన కలిగించేదిగా ఉందని, పురాతన ఆలయాలు పున:నిర్మించి జీర్ణోద్ధరణ చేసే కార్యక్రమాలకు ఈ డాక్యుమెంటరీ మార్గదర్శకంగా వుంటుందని కొనియాడారు.

దర్శకులు లక్ష్మణ్ మురారి మాట్లాడుతూ… ‘‘నాకు చిన్నప్పటి నుండి కూడా ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశోధించి తెలుసుకోవడం ఇష్టం, ఇప్పటి వరకు నేను రూపొందించిన యెన్నో డాక్యుమెంటరీలలో ఇది ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.. రాజకీయ, సమకాలీన, సినిమా అంశాలతో అనేక డాక్యుమెంటరీలు రూపొందించిన నాకు ఆ భగవంతుడే డివోషనల్ సమగ్ర డాక్యుమెంటరీని నాతో రూపొందింపచేశారని భావిస్తున్నాను’’ అన్నారు.

శ్రీ చినజీయర్ స్వామితో పాటు, ప్రముఖ వ్యాపారవేత్త My Home రామేశ్వర రావు చేతులమీదుగా ఈ డాక్యుమెంటరీ చిత్రం విడుదల చేయడం గర్వంగా ఉందని, ఈ అవకాశం రావడానికి కారణమైన బాల్య మిత్రుడు జనార్ధన్ సహకారం మరువలేనిదని, అలాగే ఆలయాన్ని పునర్నిర్మించిన P. S R T Swamy కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారుడు కాంత్ రిసా స్వహస్తాలతో రూపొందించిన శ్రీమాన్ త్రిదండి చినజీయర్ గారి సైకత చిత్రాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఆపటంపై స్వామి వారి స్వహస్తాలతో శ్రీమాన్ నారయణ అని రాయడం కొసమెరుపు. ఈ కార్యక్రమంలో MY HOME రామేశ్వర రావు , PSRT స్వామి దంపతులు, కుటుంబ సభ్యులు, సినీ దర్శకుడు బందూక్ లక్ష్మణ్ ఇతర భక్తులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు