చిక్కుల్లోనే సైరా, బయోపిక్ కాదంటోన్న డైరక్టర్

అంతా రెడీ అయిపోయింది అక్టోబరు 2న రిలీజ్ అని పబ్లిసిటీలో బిజీగా ఉన్న సైరా టీంకు తలనొప్పి వచ్చిపడింది. ఎంత ప్రయత్నించినా కొన్ని చిక్కులు సినిమా యూనిట్‌ను వదలడం లేదు. కథకు డబ్బులు ఇవ్వలేదని, రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసుకునే వీలు కల్పించినందుకు తగిన న్యాయం జరగడం లేదని తెలంగాణ హైకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. సెన్సార్ విషయంలోనూ ఆటంకం వచ్చి పడింది. బయోపిక్‌లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ పలువురు ముందుకు రావడంతో అసలు ఇది బయోపిక్ కాదని చెప్పుకొస్తున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ఫంక్షన్ లో ఇది నిజంగా జరిగిన కథ అని కర్నూలు వెళ్లి మరిన్ని వివరాలు సేకరించిన డైరక్టర్ సురేందర్ రెడ్డి కథను బాగా తయారుచేశారని చెప్పారు. ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ కోసం ఇది కల్పిత కథేనని డైరక్టర్ చెప్పడంపై గందరగోళం మొదలైంది. కొందరేమో అత్యుత్సాహం ప్రదర్శించి సెన్సార్ పూర్తి అయిపోయిందంటూ సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తుంటే.. సెన్సార్ బోర్డు సభ్యులు ఆమోదం చెప్పకముందే బయటకు వచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ చూసి షాక్ అవుతున్నారు. 
 
250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఇన్ని వివాదాలు చుట్టుముడుతుంటే, మళ్లీ రిలీజ్ డేట్ వాయిదాపడుతుందేమోనని చిరు అభిమానుల్లో ఆందోళన మొదలైంది. సురేందర్ రెడ్డి చెప్పినట్లు ఇది నిజమైన కథ కాదా.. లేదంటే సెన్సార్ కోసం అలా చెప్పారా అని సగటు ప్రేక్షకుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కాగా, కోర్టులో ఉన్న కేసు సోమవారానికి వాయిదా పడటంతో రిలీజ్ డేట్ కన్ఫామ్ అవడానికి ఆరోజు వరకూ వేచి చూడాల్సిందే. 

ఇటీవల వాల్మీకి టైటిల్‌పై వాదనలు మొదలై చివరి క్షణం వరకూ కొనసాగాయి. ఫలితంగా రిలీజ్‌కు కొద్ది గంటల ముందు సినిమా పేరు మార్చి గద్దలకొండ గణేశ్‌గా మార్చిన సంగతి తెలిసిందే.