గజిని సినిమాతో తెలుగులో భారీ హిట్టు కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆ తర్వాత పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించిన సింగం సిరీస్ కూడా తెలుగులో బాగానే హిట్టయ్యై తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ తమిళ స్టార్ హీరోకు నటుడిగానే కాక వ్యక్తిగానూ తమిళనాడులో చాలా మంచి పేరుంది. ‘అగరం ఫౌండేషన్’ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి.. కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్య.. అతడి కుటుంబ సభ్యులు.
తల్లిదండ్రులు లేక అనాథలుగా మారిన.. పేద కుటుంబాలకు చెందిన వేలాది మంది చిన్నారులకు ఈ సంస్థ చదువు చెప్పిస్తోంది. వారి బాగోగులు చూస్తోంది. చాలామంది లాగా పబ్లిసిటీ కోసం నామమాత్రంగా ఫౌండేషన్ పెట్టి హడావుడి చేయడం కాకుండా.. చాలా సిన్సియర్ గా అగరం ను నడుపుతున్నారని సూర్య కుటుంబానికి పేరుంది. సూర్య కుటుంబమే స్వయంగా అగరం ఫౌండేషన్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సంస్ధను నడుపుతోంది.
అగరం ఫౌండేషన్ ఇటీవల ఓ పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫౌండేషన్ నుంచి సహాయం పొందుతున్న గాయత్రి అనే బాలిక తన కష్టాలను పంచుకుంటూ అగరం ఫౌండేషన్ ద్వారా తాను ఎలా అభివృధ్ది చెందిందో వివరించింది. తనది చిన్న పల్లెటూరు అని, తండ్రిరోజు కూలికి వెళ్లేవాడని, తన చదువుల కోసం అగరం ఫౌండేషన్ సహాయం తీసుకున్నానని చెప్పింది. అగరం స్వఛ్ఛంద సంస్ధ ద్వారా తాను కాలేజీ చదువు పూర్తిచేసి ఇప్పుడు ఇంగ్లీషు ట్రైనర్ గా పని చేస్తున్నానని….తన విజయానికి అగరం ఫౌండేషనే కారణమని చెపుతూ భావోద్వేగానికి గురవుతూ చెప్పింది.
అదే వేదికపై ఉన్న హీరో సూర్య గాయత్రి కధ విని చలించిపోయారు. ఆయన హృదయం కదలింది, భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మైకు ముందు ఉన్న గాయత్రి వద్దకు చేరుకుని ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఈసందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య మంచి మనసును అందరూ కొనియాడుతున్నారు. అగరం ఫౌండేషన్ స్ధాపించి పదేళ్లు అవుతోంది. తనను హీరోగా అభిమానించి, ఆదరించిన ప్రజలకు, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సూర్య దీన్ని ప్రారంభించినట్లు చెప్పాడు.