telangana state film chamber
తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్‌కు మూడోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ ఎన్నికైయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులను ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సన్మానించి అభినందలు తెలిపారు. నూతన కార్యవర్గాన్ని ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అభిషేక్ అగర్వాల్, తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు.
అనంతరం తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడే హక్కు తమకు లేదన్నారు. హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఏ వ్యాపారమైన డిమాండ్ అండ్ సప్లై మీదే ఆధారపడి ఉంటుందన్నారు. ఫిలిం ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో తాను లేనని చెప్పారు. థియేటర్ల బంద్ వార్త విని తాను కూడా ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. థియేటర్లకు సంబంధించి ఆ నలుగురు అనే వారు ఎవరూ లేరు. చాలామంది ఓనర్లు ఉన్నారు. పర్సంటేజ్ విధానం త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు.
150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రేక్షకులను అలరించేందుకు 30 నుంచి 40 మంది హీరోలు మాత్రమే ఉన్నారని అన్నారు. హీరోలు దేవుళ్లు లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత చేయరని చెప్పారు. ఇక అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ తుఫాను లాంటి వారని, ఆయన సినిమాని ఆపే అధికారం ఎవ్వరికి లేదని. నారంగ్ అన్నారు.
సింగిల్ స్క్రీన్ లలో పర్సంటేజీ విధానం అమలు కావాలని 2016 నుంచి పోరాడుతున్నామని కార్యదర్శి శ్రీధర్ అన్నారు. సింగిల్ స్కిన్ థియేటర్లను కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సికింద్రాబాద్‌లో ఇప్పటికే ఆరు థియేటర్లు మూతపడ్డాయన్నారు. పర్సంటేజ్ విధానంపై తెలుగు ఫిలిం చాంబర్లు సంప్రదించినట్లుగా తెలిపారు. పర్సంటేజ్ ఇవ్వకపోతే థియేటర్లో బంద్ చేస్తామని ఎక్కడ చెప్పలేదన్నారు.
‘థియేటర్ల బంద్ అంశం తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల నుంచి వచ్చింది. వాళ్లు మా మద్దతు కోరారు, దానిపై అందరం తెలుగు ఫిలిం చాంబర్ లో కూర్చుని మాట్లాడం. థియేటర్ల బంద్ వివాదంపై తెలంగాణ ఫిలిం చాంబర్ నుంచి ఎవరికీ ఎలాంటి లెటర్ ఇవ్వలేదు. ఇద్దరు నిర్మాతలు ఇద్దరు డైరెక్టర్ల వల్ల ఈ వివాదం మరింత ముదిరింది. అవసరం వచ్చినప్పుడు వాళ్ల పేర్లు బయటపెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా కోసం థియేటర్లను ఖాళీగా ఉంచాం. ఈనెల మొత్తం పూర్తిగా నష్టపోయాం. ఈ ఏడాది జనవరి నుంచి మూడు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి . సంక్రాంతి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, కోర్టు చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇలా అయితే మేము ఎలా బతకాలి. అనవసరంగా సింగిల్ స్క్రీన్ లను బదనాం చేస్తున్నారు. హీరోలకు స్టార్ హోదా ఎక్కడి నుంచి వచ్చింది. ఒకప్పుడు హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కో హీరో ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదు. 10 లక్షలు తీసుకునే ఒక హీరోకి తదుపరి సినిమాకి 30 లక్షలు ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన ఒక సినిమా డిజాస్టర్ అయితే ఆ హీరో ని పిలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. థియేటర్లు మా ఆస్తులు, మేము ఏమైనా చేసుకుంటాం. హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తే థియేటర్లు ఎలా నడుస్తాయి. థియేటర్లు ఉన్నవాళ్ళమంతా ఒకే రూఫ్ కిందకు వచ్చాం. మా గ్రూపును చూసి ఎగ్జిబిటర్ వస్తే నాలుగు డబ్బులు దొరుకుతాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను మల్టీప్లెక్స్ తరహాలోనే నిర్వహణ చేసుకుంటున్నాం. ప్రేక్షకుడికి తక్కువ ధరతో పాటు 80 రూపాయల్లోనే పాప్ కార్న్, 30 రూపాయలకే కూల్ డ్రింక్ అందిస్తున్నాం.’ అని శ్రీధర్ అన్నారు.