Star Directors : స్టార్ హీరోలతో సినిమాలు చేసే దర్శకులకు నయా టెన్షన్..!
స్టార్ హీరోలతో సినిమా చేయడం దర్శకులకు (Star Directors) లక్కీ ఛాన్స్ అయితే అదే సమయంలో అది పెద్ద సవాల్‌గా కూడా మారుతోంది.
- Thota Vamshi Kumar
- Published on- September 25, 2026 / 09:43 AM IST
Tension for directors making movies with star heroes
Star Directors : స్టార్ హీరోలతో సినిమా చేయడం దర్శకులకు లక్కీ ఛాన్స్ అయితే అదే సమయంలో అది పెద్ద సవాల్‌గా కూడా మారుతోంది. స్టార్ హీరో సినిమా అంటే అభిమానుల్లో ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఫ్యాన్స్ అంచనాలకు సినిమా ఏ మాత్రం తగ్గినా, ముందుగా సోషల్ మీడియాలో దర్శకుడిపైనే ట్రోలింగ్ మొదలవుతోంది.
ప్రభాస్‌తో ఆదిపురుష్ చేసిన ఓం రౌత్‌పై ఫుల్ ట్రోల్స్ నడిచాయి. విజువల్స్, స్టోరీ, టేకింగ్‌పై విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రభాస్‌తో ది రాజాసాబ్ చేసిన మారుతికి అయితే అభిమానులు చుక్కలు చూపించారు. మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ చేసిన మెహర్ రమేష్ పరిస్థితి కూడా ఇదే. సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే సోషల్ మీడియాలో దర్శకుడి చుట్టే రచ్చ నడుస్తుంది. స్టార్ హీరోతో సినిమా అనగానే హీరో ఇమేజ్‌ను ఉపయోగించుకోవడం మాత్రమే కాదు.. ఆ ఇమేజ్‌కు తగ్గ కథ, ట్రీట్‌మెంట్, ఎగ్జిక్యూషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా దర్శకుడిపైనే పడుతోంది.
యష్, గీతూ మోహన్‌దాస్ టాక్సిక్, నాని, శ్రీకాంత్ ఓదెల ది పారడైజ్ సినిమా విషయంలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. టాక్సిక్‌పై భారీ అంచనాలు, యష్ ఇమేజ్‌కు తగ్గ విజువల్ ట్రీట్‌మెంట్‌పై చర్చ జరిగినట్టే, టేకింగ్ కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇక నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై దసరా మూవీ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. అందుకే పారడైజ్‌పై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండటం.. రిలీజ్ అయ్యాక టేకింగ్, స్టోరీ, ఎగ్జిక్యూషన్ విషయంలో అందరి వేళ్లు దర్శకుడివైపే చూపిస్తున్నాయి. స్టార్ హీరోతో సినిమా చేసిన దర్శకుడికి సక్సెస్ కొడితే హీరోతో పాటు క్రేజ్ వస్తుంది. ఒకవేళ సినిమా అంచనాలను అందుకోకపోతే మాత్రం విమర్శల భారం మొత్తం దర్శకుడిపైనే పడుతుంది. స్టార్ హీరోతో సినిమా చేయడం పెద్ద అవకాశం.. కానీ ఆ స్టార్ ఇమేజ్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే పెద్ద భారమేనన్న టాక్ వినిపిస్తోంది.
