Thank You Brother: అనసూయ, అశ్విన్ విరాజ్ పాత్రల్లో నటిస్తుండగా.. ఉత్కంఠభరిత అంశాలతో ఒక డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్!’ జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాధ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.
తాజాగా ‘థ్యాంక్ యు బ్రదర్!’ ట్రైలర్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ప్రెగ్నెంట్ వుమెన్‌గా అనసూయ నేచురల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. లిఫ్ట్‌లో స్టక్ అయిపోయిన గర్భవతి ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అలా అనసూయ తన నటనతో భావోద్వేగానికి గురి చేస్తూ కంటతడి పెట్టించింది.
ట్రైలర్ విషయానికొస్తే.. ప్లే బాయ్ లాంటి అభి అనే ఓ యువకుడు, ప్రెగ్నెంట్ అయిన ప్రియ అనే యువతి ఓ లిఫ్ట్‌లో ఉండగా పవర్ పోయి, అందులో చిక్కుకుపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయనేది ప్రధానాంశంగా కనిపిస్తుంది. ‘‘నిన్ను కనేటప్పడు పడ్డ పురిటినొప్పులు ఇప్పటికీ పడుతూనే ఉన్నాన’’ని అభి తల్లి చెప్తున్న మాటల్ని బట్టి అభి క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమవుతుంది. అలాంటివాడు లిఫ్ట్‌లో తనతో పాటు చిక్కుకున్న ప్రెగ్నెంట్ లేడీతో ఎలా ప్రవర్తించాడు, అందమైన కుటుంబం ఉన్న ప్రియ అనుకోకుండా లిఫ్ట్‌లో చిక్కుకుపోయి, పక్కనే తనతో పాటు ప్లేబాయ్ లాంటి యువకుడితో గడపాల్సి వచ్చి, అందులోనే పురిటినొప్పులు వస్తే ఏం చేసిందనేది ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో డైరెక్టర్ రమేష్ రాపర్తి ఈ ఫిల్మ్‌ను రూపొందించారు.
కచ్చితంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చే విధంగా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది.
ఆదర్శ్ బాలకృష్ణ, అనీష్ కురువిల్లా, హర్ష ఇతర పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకి సురేష్ రగుతు సినిమాటోగ్రఫి, గుణా బాలసుబ్రమణియన్ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ‘థ్యాంక్ యు బద్రర్’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.