×
Ad

Itlu Mee Yedava Review : ‘ఇట్లు మీ ఎదవ’ మూవీ రివ్యూ.. ఎదవలు ప్రేమించకూడదా..? క్లైమాక్స్ ఊహించలేరు..

ఎదవ అని పిలిపించుకునేవాళ్లంతా ఎదవలు కాదు అని చెప్పడానికి ఈ సినిమా తీసారేమో. (Itlu Mee Yedava Review)

Itlu Mee Yedava Review

Itlu Mee Yedava Review : త్రినాథ్ కఠారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ఇట్లు మీ ఎదవ. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బళ్లారి శంకర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సాహితీ అవాంచ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నవంబర్ 21వ తేదీన రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Itlu Mee Yedava Review)

కథ విషయానికొస్తే.. శ్రీను(త్రినాథ్ కఠారి) ఆరేళ్లుగా పీజీ చదువుతూ ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. ఆ కాలేజీలో మనస్విని(సాహితీ అవాంచ) జాయిన్ అవ్వడంతో ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె చుట్టూ తిరిగి ఆమెని మెప్పించేలా మారి మనుని ప్రేమలో పడేస్తాడు. ఎప్పుడూ ఎదవలా తిరిగే కొడుకు బాగుపడుతుండటంతో శ్రీను లవ్ లో పడ్డాడని తెలుసుకొని అతని తండ్రి(గోపరాజు రమణ) మను తండ్రి(దేవి ప్రసాద్) దగ్గరకు వెళ్లి పెళ్లి సంబంధం అడుగుతాడు. కానీ నా కూతురు నీ కొడుకు వల్లే మారిపోయింది, అసలు అలాంటి ఎదవకు పిల్లనిస్తారా అని తిట్టి పంపిస్తాడు.

దీంతో శ్రీను మను వాళ్ళింటికి మాట్లాడదామని వెళ్తే ఈ ఇష్యూ కాస్త ఓ డాక్టర్ వద్దకు వెళ్తుంది. శ్రీనుని ముప్పై రోజులు మను తండ్రితో ఉండాలని, అప్పటికి శ్రీను నిజంగా ఎదవ అని తెలిస్తే ఈ ప్రేమ వదిలేయాలని డాక్టర్ ఛాలెంజ్ పెట్టడంతో శ్రీను – మనులు, మను తండ్రి ఒప్పుకుంటారు. మరి శ్రీను ముప్పై రోజుల్లో మంచోడు అనిపించుకుంటాడా? ఎదవ అనిపించుకుంటాడా? ఈ ముపై రోజుల్లో ఏం జరిగింది? శ్రీను – మనుల పెళ్లి జరుగుతుందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Raju Weds Rambai Review : ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ.. బాబోయ్ ఇదెక్కడి క్లైమాక్స్ రా బాబు..

సినిమా విశ్లేషణ..

గతంలో బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ హీరో వాళ్ళింట్లో తమ ప్రేమ కోసం ఉండటం అనే కాన్సెప్ట్ ని రివర్స్ చేసి ఇక్కడ 30 రోజులు హీరోని హీరోయిన్ వాళ్ళ నాన్నతో తిరగాలి అనే కాన్సెప్ట్ రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ లవ్ సీన్స్, కాలేజీ సీన్స్ తో బోర్ కొట్టిస్తారు. కొన్ని కొన్ని సీన్స్ రాసుకొని వాటిని అతికించినట్టు ఉంటుంది. శ్రీను – మనుల ప్రేమ ఇంట్లో తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి 30 రోజుల ఛాలెంజ్ తో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది.

సెకండ్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ వాళ్ళ నాన్న చుట్టూ, నాన్న – బాయ్ ఫ్రెండ్ మధ్యలో నలిగిపోతూ హీరోయిన్ చుట్టూ కథ తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ అవసరమా అనిపిస్తాయి. కామెడీ చేయాలని ట్రై చేసారు కానీ ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ ఊహించలేరు. ప్రీ క్లైమాక్స్ కాస్త ఎమోషనల్ గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం కథని నడిపించిన దానికి భిన్నంగా బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ కోసం సినిమా మొత్తం చూడాల్సిందే. టైటిల్ కి తగ్గట్టు సినిమా మొదట్నుంచి చివరి వరకు హీరో ఎదవ.. ఎదవ.. అని అనిపించుకుంటూనే ఉంటాడు. ఎదవ అని పిలిపించుకునేవాళ్లంతా ఎదవలు కాదు అని చెప్పడానికి ఈ సినిమా తీసారేమో.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఓ పక్క దర్శకుడిగా సినిమా తీస్తూనే మరోపక్క హీరోగా బాగానే నటించాడు త్రినాథ్. చబ్బీగా క్యూట్ గా హాఫ్ శారీలలో కనిపిస్తూ తెరపై అందాన్ని తీసుకొచ్చింది సాహితీ. అందంతో పాటు నటనతో కూడా మెప్పించింది. ఎప్పుడు తిడుతూ ఉండే తండ్రి పాత్రలో గోపరాజు రమణ, కూతురు కోసం ఆలోచించే తండ్రి పాత్రలో దేవి ప్రసాద్.. ఇద్దరూ వారి పాత్రల్లో ఒదిగి నటించారు. డాక్టర్ పాత్రలో తనికెళ్ళ భరణి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి ఆ పాత్రలో బాగానే సెట్ అయ్యారు. నవీన్ నేని, ప్రభావతి, మధుమతి.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Paanch Minar Review : ‘పాంచ్ మినార్’ మూవీ రివ్యూ.. క్రైం కామెడీతో రాజ్ తరుణ్ హిట్ కొట్టాడా?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బీచ్ లో సీన్స్, సాంగ్స్ లో మాత్రం విజువల్స్ అద్భుతంగా చూపించారు. RP పట్నాయక్ తన పాత స్టైల్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు ఇవ్వడంతో ఇవన్నీ ఎక్కడో ఆయన పాత సినిమాల్లోనే విన్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ పాటలు మాత్రం వినడానికి బాగానే ఉన్నాయి. బొమ్మరిల్లు కాన్సెప్ట్ ని మార్చి కొత్తగా రాసుకొని రొటీన్ సీన్స్ తో మంచి క్లైమాక్స్ తో రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘ఇట్లు మీ ఎదవ’ సినిమా బొమ్మరిల్లుని రివర్స్ చేసి రాసుకున్న ఓ లవ్ స్టోరీ. ఓ సారికి టైం పాస్ కోసం చూడొచ్చు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.