మోడీని ట్వీట్‌తో ప్రశ్నించిన ఉపాసన

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశారు. గాంధీ ఆశయాలను సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. ఈ సమావేశానికి బాలీవుడ్ ప్రముఖులు విచ్చేసి తమ భావాలను ప్రధానితో పంచుకున్నారు. కేవలం బాలీవుడ్ నటులనే పిలవడం సౌత్ ఇండస్ట్రీ నుంచి ఒక్కరిని కూడా పిలవకపోవడం గమనార్హం.

దీనిపై చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య, ఉపాసన స్పందించారు. సౌత ఇండస్ట్రీపై చిన్న చూపు ఎందుకని నేరుగా మోడీకి ట్వీట్ చేస్తూ ప్రశ్నించారు. దీంతో పాటు షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ల ఫొటోలను పోస్టు చేస్తూ జై హింద్ అని కామెంట్ చేశారు. 

‘డియరెస్ట్ నరేంద్ర మోడీ జీ. దక్షిణ భారతదేశంలో ఉన్న మేము మిమ్మల్ని ప్రధానిగా ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నాం. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు కేవలం హిందీ ఆర్టిస్టులను మాత్రమే పిలిచి దక్షిణాది సినిమా ఇండస్ట్రీపై నిర్లక్ష్యం చూపించారు. నాకు బాధగా అనిపించి భావాలను మీతో పంచుకుంటున్నాను. దీన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను’ అని ఉపాసన ట్వీట్ చేశారు.